ఉక్రెయిన్ నగరాల పై కొనసాగుతున్న రష్యా భీకర దాడులు దీటుగా బదులిస్తున్న ఉక్రెయిన్ సైన్యం, సాయుధ పౌరులు అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని పుతిన్ ఆదేశం ఇది దేశాలను రెచ్చగొట్టడమే: మండిపడిన నాటో దేశాలు.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చల కోసం తమ అధికారులు బెలారస్ వెళ్లారని ప్రకటించిన పుతిన్.. ఆ వెంటనే అందుకు పూర్తి విరుద్ధమైన, సంచలన ప్రకటన చేశారు. రష్యా అణ్వాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని, ఆయుధాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నాటో దేశాలు తమపై ఆంక్షలతో కవ్వింపులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పుతిన్ తాజా ఆదేశంపై నాటో దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ప్రపంచదేశాలను రెచ్చగొట్టేలా ఉన్నదని ధ్వజమెత్తాయి. రష్యా అణు యుద్ధాన్ని కోరుకొంటున్నదని అమెరికా మండిపడింది. మరోవైపు, రష్యా బలగాలతో నాలుగో రోజు కూడా ఉక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడింది. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే, ఉక్రెయిన్ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది.