న్యూ ఢిల్లీ 28
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేసినట్లు ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. అంతే కాకుండా భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నది. స్వదేశానికి వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు, ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకుని పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. హంగేరి, పోలాండ్, రోమానియా దేశాల నుంచి విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు విమానాల్లో విద్యార్థులను తరలించారు. ఇంకా ఉక్రెయిన్‌లో 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారతీయ విద్యార్థులను తరలించే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కొందరు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు హరిదీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింథియా, కిరణ్ రిజిజు, వీకే సింగ్‌లు.. భారతీయ విద్యార్థులను తీసుకువచ్చేందుకు విదేశాలకు వెళ్లనున్నారు.