అమరావతి
పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని అయన కేంద్రాన్ని ఇప్పటికే అనేకసార్లు అభ్యర్థించారు. పోలవరంపై గతంలోనూ అనేక సార్లు స్పందించిన కేంద్రం, ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామంటూ హామీలు కూడా ఇచ్చింది. ఈ మధ్య.విజయవాడ కు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి తాను కచ్చితంగా వస్తానంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నెల 4వ తేదీన పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రితో కలిసి జగన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. సందర్శన అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తారు.
2017-18 ధరల ప్రకారం ఆమోదం తెలిపిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ కోరనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి కేంద్ర మంత్రి షెకావత్ ఈ నెల 3వ తేదీన వస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిజైన్లను సీడబ్ల్యూసీతో వేగంగా ఆమోదించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి అనిల్ కుమార్ ఆదేశించారు. ముంపు గ్రామాలలోని నిర్వాసితుల పునరావాసంపై కూడా అధికారులతో మంత్రి చర్చించారు.