హైదరాబాద్, మార్చి 1,
కేసీఆర్‌ను మించిన రాజకీయ వ్యూహకర్త లేరని టీఆర్ఎస్ శ్రేణులు ఎంత గొప్పగా చెప్పుకున్నా చివరకు దానికి విరుద్ధంగా ఆ పార్టీ కార్యాచరణ కొనసాగుతున్నది. గులాబీ పార్టీ ప్రశాంత్ కిషోర్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నది. ఆయనకు రెండు టాస్కులను అప్పజెప్పినట్లు ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు వెల్లడించారు. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అంశం కాగా మరొకటి జాతీయ రాజకీయాలకు సంబంధించినది. మొదటి అంశంపై గ్రౌండ్ వర్క్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాకున్నా రెండో టాస్క్ మాత్రం కంటిన్యూగా జరుగుతూనే ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసమే ఇరవై రాష్ట్రాల్లో ఐ-ప్యాక్ టీమ్‌లను పీకే సిద్ధం చేశారు. ఇంకోవైపు బీజేపీ వ్యతిరేక వైఖరితో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరపడానికి నిర్దిష్టంగా ఆ రాష్ట్రాల్లోని స్థానిక సమస్యలు, అంశాలపై కూడా పీకే టీమ్ బ్రీఫింగ్ ఇస్తున్నది. భేటీలో ఏయే అంశాలను ప్రస్తావించాలి..? నేతలతో చర్చించే సమయంలో కేంద్రం వైఫల్యాన్ని కేసీఆర్ ప్రస్తావించడానికి వీలుగా ఈ సహకారం అందిస్తున్నది. ఇరవై రాష్ట్రాల్లో పర్మినెంట్‌గానే ఈ టీమ్‌లను సెటప్ చేసినట్లు సమాచారం. కేసీఆర్ కామెంట్లను కొన్ని రాష్ట్రాల్లో దళిత సంఘాలు, ప్రాంతీయ పార్టీలు పట్టించుకోకపోయినా ఈ టీమ్‌లే ప్రస్తావించి పల్స్ ఎలా ఉందో పసిగడుతున్నాయి.జాతీయ రాజకీయాకు సంబంధించి కేసీఆర్ ఏ అంశాన్ని ప్రస్తావిస్తే ఏయే రాష్ట్రంలో ఎలాంటి వైబ్రేషన్ వస్తున్నదో ఈ టీమ్‌లు స్టడీ చేస్తున్నాయి. అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలపై ఆ టీమ్‌లు నివేదికలు ఇస్తున్నాయి. ఏ అంశానికి ఏ సెక్షన్ ఎలా స్పందిస్తున్నదో వివరిస్తున్నాయి. యాంటీ-బీజేపీ స్టాండ్, రాజ్యాంగం రీడిజైన్, ప్రధానిగా మోడీ ఫెయిల్యూర్, ఏడున్నరేళ్లలో పెరిగిన అవినీతి, రఫేల్ స్కామ్, బీజేపీపై ప్రజలు నమ్మకం కోల్పోవడం, రాష్ట్రాల హక్కులకు గ్యారంటీ లేకపోవడం, కేంద్రం నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండడం, బడ్జెట్‌లో రాష్ట్రాలకు నిధుల ఇవ్వకపోవడం, నిరుద్యోగం తదితర అంశాలపై కేసీఆర్ చేసిన కామెంట్లకు వస్తున్న స్పందన ఫీడ్ బ్యాక్‌ను ఈ బృందాలు పంపుతున్నాయి. కేసీఆర్ కామెంట్లు ఆయా రాష్ట్రాల్లోని కామన్ పబ్లిక్‌కు రీచ్ అవుతున్నాయా? ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? వాటి ప్రభావం ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉన్నది? తదితరాలన్నింటినీ తెలుసుకోడానికి ఐ-ప్యాక్ టీమ్‌లు సహకారమందిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌ను ప్రజలు నమ్ముతున్నారా? యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికీ బీజేపీ బలంగా ఉన్నదా? లాంటి వివరాలనూ కేసీఆర్ తెలుసుకుంటున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సగటున పదికంటే ఎక్కువ చిన్నాచితకా పార్టీలు ఉన్నందున అవి ఏమనుకుంటున్నాయో, అందులో ఎన్ని ఫ్రంట్‌వైపు వస్తాయో? అంచనాకు రావడానికి ఈ నివేదికలు, ఐ-ప్యాక్ స్టడీ ఉపయోగపడుతున్నది. దేశభక్తి, చైనాతో సంబంధాలు లాంటి సున్నితమైన అంశాల్లోనూ ఆయా రాష్ట్రాల్లోని సామాన్య ప్రజల అభిప్రాయాలను ఈ బృందాలు సేకరిస్తున్నాయి.భారత రాజ్యాంగాన్ని రీడిజైన్ చేయాలి, రీరైట్ చేయాలి అని కేసీఆర్ ఇటీవల చేసిన కామెంట్లకు ఏ రాష్ట్రంలో ఎలాంటి అనుకూల, ప్రతికూల స్పందనలు వచ్చాయో ఇరవై రాష్ట్రాల్లో ఐ-ప్యాక్ టీమ్‌లు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చాయి. ప్రాంతీయ పార్టీలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కేసీఆర్ వ్యాఖ్యలపై ఎలా స్పందించాయో ఆ నివేదికలో పొందుపర్చాయి. గత కొన్ని రోజులుగా రాజ్యాంగంపై కేసీఆర్ ప్రస్తావించకపోవడానికి ఆ నివేదికలో వచ్చిన అభిప్రాయాలే కారణమని తెలిసింది. చాలా రాష్ట్రాల్లోని దళిత సంఘాలతో టీఆర్ఎస్‌కు నేరుగా సంబంధాలు లేనందువల్ల ఐ-ప్యాక్ టీమ్‌ల ద్వారా కేసీఆర్ తెలుసుకుంటున్నారు. రాష్ట్రాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా ఏ అంశాన్ని ఎక్కువగా నొక్కిచెప్పాలో, దేన్ని కొంతకాలం పాటు పక్కన పెట్టాలో కేసీఆర్ నిర్ణయించుకోడానికి ఐ-ప్యాక్ టీమ్‌ల సర్వే నివేదికలు ఉపయోగపడుతున్నాయి. నిర్దిష్టంగా ఒక అంశాన్ని మరిన్ని కోణాల్లో స్పృశించాలా? లేక అక్కడితోనే ఫుల్‌స్టాప్ పెట్టాలా? అనేదానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఒక అంశాన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లో బహిరంగంగా ప్రస్తావించిన తర్వాత అది ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లింది.? అన్నది చర్చనీయాంశంగా మారింది? ఆశించిన ఫలితాలు ఏ మేరకు వస్తున్నాయి? తదితరాలన్నింటిపై నివేదికల ద్వారా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో కేసీఆర్ స్పష్టతకు వస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా అక్కడి ఇతర ప్రాంతీయ పార్టీలతోనూ కేసీఆర్ రానున్న కాలంలో చర్చలు జరపనున్నారు. దీనికి అవసరమైన కో–ఆర్డినేషన్ వ్యవహారాలను పీకే పర్యవేక్షిస్తున్నారు. మార్చి 3న ఢిల్లీ వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి పీకేతో చర్చించాలని తొలుత కేసీఆర్ అనుకున్నా ఇప్పుడు ఆయనే హైదరాబాద్ రావడంతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని ఒక రోజంతా చర్చించినట్లు తెలిసింది. ప్రకాష్‌రాజ్‌ను జాతీయ రాజకీయాల్లో ఎలా వాడుకోవాలో కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. ఆయనతో అనుకూల అంశాలతో పాటు ప్రతికూలమైనవి కూడా కొన్ని ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రకాష్‌రాజ్‌పై బీజేపీ వ్యతిరేకి అనే ముద్రతోపాటు హిందూ వ్యతిరేకి అనే ముద్ర కూడా ఉండటంతో ఆయనతో వచ్చే ప్రతికూల ప్రభావాన్ని కూడా టీఆర్ఎస్ అంచనా వేస్తున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ పరిస్థితిని విశ్లేషించి జాతీయ రాజకీయాలపై తీసుకోబోయే వైఖరిమీద కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీ స్థాయిలో ఒక జాతీయ సమన్వయ కమిటీని పెట్టి అందులో పీకేతో పాటు ప్రకాశ్‌రాజ్, కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీని కూడా భాగస్వామిని చేయనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.