విజయవాడ, మార్చి 1,
చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమవుతున్నారు. పార్టీ యంత్రాంగాన్ని యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు. ఆయన భారతీయ జనతా పార్టీతో పొత్తుకోసమే ఎక్కువగా తహతహలాడుతున్నారు. ఎక్కువ స్థానాలను పొత్తుల్లో కోల్పోయినా సరే ఈసారి అధికారం చేపట్టాలంటే జనసేనే, బీజేపీల మద్దతు చంద్రబాబుకు అవసరం. ఓట్ల పరంగా జనసేన, నోట్ల పరంగా బీజేపీ సహకారం అవసరమన్నది చంద్రబాబు భావన.పవన్ కల్యాణ్ తో జత కడితే ఒక సామాజికవర్గం ఓట్లతో పాటు యువత ఓట్లు ఎక్కువగా తమ కూటమి వైపు మరలుతాయని చంద్రబాబుకు తెలుసు. పవన్ కల్యాణ‌్ కూడా టీడీపీతో పొత్తుకు సుముఖంగానే ఉన్నారు. దీంతో సీట్ల విషయంలో రాజీ పడయినా పవన్ తో జతకట్టేందుకు మానసికంగా చంద్రబాబు ఎప్పుడో సిద్ధమయ్యారు. వీరి కలయిక ఖాయమని దాదాపు తెలిసిపోయింది. రెండు పార్టీల నేతలు కూడా పొత్తు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక బీజేపీ అవసరం చంద్రబాబుకు చాలా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత లేకుంటే నిధుల విషయంలో ఇబ్బందులు తప్పవు. ఆ విషయం గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు ఎదురయింది. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కొనాలంటే నిధుల అవసరం చాలా ఉంది. నిధులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఎవరూ ఫండింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతోపాటు ఈడీ, సీబీఐ వంటి సోదాల నుంచి మినహాయింపు లభిస్తుంది. అందుకే కాంగ్రెస్ కు దూరంగా చంద్రబాబు ఉంటున్నారు. కనీసం బీజేపీ యేతర నేతలతో చంద్రబాబు దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే బీజేపీ అధినాయకత్వం నుంచి పిలుపు వస్తుందన్న ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ తో పొత్తు కుదురుతుందని చంద్రబాబు నేతల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.