తిరుపతి, మార్చి 1,
నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకంలో చేపట్టిన జగనన్న కాలనీల ఇంటి నిర్మాణ పనులు ప్రభుత్వం ఆశించిన స్ధాయిలో జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 15.60 లక్షల గృహాలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా నిర్ణయించు కున్నప్పటికీ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. లే అవుట్‌లు పట్టణాలకు దూరంగా ఉండటం, నిర్మాణ సామాగ్రి, మెటీరియల్‌తో పాటు సిమెంటు, ఇనుము ధరలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు నిధులు సరిపోకపోవడం, మౌలిక వసతులు సమకూరకపోవడం, మెటీరియల్ రవాణాకు కూడా లబ్దిదారులే ఖర్చులు భరించాల్సి వస్తున్న నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులు వెనుకడుగేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ కేవలం 11.65 లక్షల ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. వీటిలో 8.55 లక్షల లేఅవుట్స్‌లో గ్రౌండింగ్ అయ్యాయి. సొంత స్ధలాల్లో నిర్మించేకునే ఇళ్లు, పొజీషన్ సర్టిఫికెట్లు తీసుకున్న వారు 3.10 లక్షలు ఉన్నాయి. మొత్తంగా పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణం జరిగినవి కేవలం 9,947 మాత్రమే ఉన్నాయి. బేస్‌మెంట్ లెవల్ కంటే ఎక్కువగా నిర్మాణాలు సాగిన జిల్లాలను పరిశీలిస్తే చిత్తూరు 44 శాతం, అనంతపురం 30 శాతం, విజయనగరం 30శాతంతో ముందుండగా, నిర్మాణాలు తక్కువగా జరుగుతున్న జిల్లాల్లో గుంటూరు 14 శాతం, కృష్ణ 16 శాతం, కర్నూలు 16 శాతంగా గణాంకాలు సూచిస్తున్నాయి.ప్రభుత్వం హామీతో ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా ఆశించిన ఫలితం రావడం లేదు. ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేల వంతున రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు అంగీకరించాయి. కానీ క్షేత్రస్థాయిలో లబ్దిదారులు రుణ మంజూరు కోసం ఎదురుచూపులు చూడాల్సివస్తోంది. ఇప్పటి వరకు 2,99,612 మంది లబ్దిధారులకు రూ.1202.94 కోట్లు రుణ మంజూరుకే బ్యాంకులు ముందుకొచ్చాయి. మిగిలిన 12 లక్షల మందికి రుణాలు ఎప్పటిలోగా ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అటు నిర్మాణాల వ్యయం పెరిగిపోతూ..ఇటు రుణమూ మంజూరు కాకపోవడంతో 'నవరత్నాల' ఇళ్ల నిర్మాణాలు ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు చేయూతనందించాల్సిందిగా లబ్దిదారులు కోరుకుంటున్నారు.