శ్రీకాకుళం, మార్చి 1,
భావనపాడు పోర్టు ప్రభావిత ప్రజల ఊసే లేకుండా, నిర్వాసితులతో కనీస సంప్రదింపులు కూడా జరపకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఏకంగా 717.26 ఎకరాల భూసేకరణకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్థానిక రైతులు, మత్స్యకారులు భగ్గుమంటున్నారు. తమతో కనీస సంప్రదింపులు కూడా చేయకుండా బలవంతంగా 'పోర్టు'ను రుద్దడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భావనపాడు ప్రాంతంలో పోర్టు నిర్మాణం ప్రతిపాదన ఉండగా, కొత్త లేఅవుట్ ప్రకారం భావనపాడు-మూలపేట మధ్యలో పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేట, మర్రిపాడు, రాజపురం, నౌపడ, నందిగాం మండలం దిమిలాడ నర్సిపురం గ్రామాల్లో భూములను సేకరించనున్నారు. భూ సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సంతబొమ్మాళి మండలం మూలపేటలో సోమవారం సమావేశం కావాలని పోర్టు ప్రభావిత గ్రామాల ప్రజలు నిర్ణయించుకున్నారు. పునరావాసం, పరిహారం అంశాలు, పోర్టులో ఉద్యోగాలు, మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్తున్నారు. 2015 ఆగస్టులో రైతులకు తెలియకుండానే నాటి టిడిపి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ వేయడంతో భావనపాడు పోర్టు వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యాన హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటిఫికేషన్‌కు కాలపరిమితి తీరిపోవడంతో రద్దయింది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొత్త ప్రాతిపాదనలను సిద్ధం చేసింది. ఈ ఏడాది జనవరిలో టెండర్లను ఖరారు చేసి, విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కంపెనీకి రూ.3,600 కోట్లకు అప్పగించింది. తాజాగా పోర్టు కోసం 717.26 ఎకరాలు సేకరించాలని టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మత్‌ను ఆదేశించింది. వాస్తవానికి కొత్త లేఅవుట్‌కు అనుగుణంగా 1,010 ఎకరాలు సేకరించాలని గతేడాది ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. పోర్టు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎపి మారిటైం బోర్డు తుది కసరత్తు చేసి 717.26 ఎకరాలు కావాలని కోరింది. బోర్డు సూచనలకు అనుగుణంగా అధికారులు ఆ మేరకు భూసేకరణకు సిద్ధమవుతున్నారు. ఇందులో రెవెన్యూ భూమి 90.23 ఎకరాలు, పట్టా భూమి 320.05 ఎకరాలు, కోస్టల్ బెల్ట్ భూమి 122.06 ఎకరాలు, అటవీ భూమి 2.99 ఎకరాలు, ఉప్పు భూములు 234.44 ఎకరాలు ఉన్నట్లు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లో బోర్డు పేర్కొంది. దీంతోపాటు రైలు మార్గానికి 157.09 ఎకరాలు, రోడ్డు మార్గానికి 27.83 ఎకరాలు అవసరం పడుతుందని తెలిపింది. ఇందులో అటవీ, ఉప్పు భూముల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ భూములను మినహాయించి ప్రస్తుతం 717.26 ఎకరాలను సేకరించనున్నారు.