మెదక్
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత జాతరను రాష్ట్ర ఆర్ధిక, వైద్యశాఖ మంత్రి హరీష్ రావుప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు . మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు దంపతులకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజల అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. రూ.100 కోట్లతో ఏడుపాయల ఆలయం వద్ద ఫౌంటెన్స్ , క్వార్ట్జ్ లు ,ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఏడుపాయల వద్ద నిరంతరం నీళ్లు ఉంటాయన్నారు. గతంలో ఏడుపాయల వద్ద నీళ్ళ కోసంఅనేక ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్ కు నీళ్లు వస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారు... కానీ నేడు ఆ నీటిని మనం చూస్తున్నామని అన్నారు. మల్లన్నసాగర్ అంటే జల ప్రవాహిని, శివుడి నెత్తి మీద నుండి గంగ కిందికి దుంకినట్టు నీళ్లు వస్తున్నాయని.. ఇకపై మనకు నీటి కొరత అనేది రాదన్నారు. మల్లన్నసాగర్ నీళ్ల తో మెదక్ జిల్లా ను సస్యశ్యామలం చేస్తామన్నారు.