ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది వారియర్'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు. తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లోనూ ఆది పినిశెట్టి పాపులర్. డిఫరెంట్ స్టోరీలు, క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్‌లో దూసుకు వెళ్తున్నారు.'ది వారియర్'లో గురు పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. ఆయన ఫస్ట్ లుక్ చూస్తే... రాక్షసత్వానికి ప్రతీకగా అనిపిస్తోంది. క్యారెక్టర్ కోసం లుక్, స్టయిలింగ్ మార్చారు. ప్రేక్షకులను ఈ లుక్ ఆకట్టుకుంటోంది. 'సరైనోడు' తర్వాత ఆది పినిశెట్టికి ప్రతినాయక పాత్రలు చాలా వచ్చినప్పటికీ 'నో' చెప్పిన ఆది పినిశెట్టి... గురు పాత్ర గురించి చెప్పిన వెంటనే అంగీకరించారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ "సినిమాలో గురు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి అందరినీ ఆకట్టుకుంటారు. రామ్, ఆది మధ్య సన్నివేశాలు నువ్వా - నేనా అన్నట్టు ఉంటాయి" అని అన్నారు.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ... "మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశాం. విడుదలైన కొన్ని క్షణాల్లో లుక్ వైరల్ అయ్యింది. రెస్పాన్స్ బాగుంది. గురు పాత్రకు ఆది పినిశెట్టి 100 శాతం యాప్ట్. ఈ క్యారెక్టర్ సమ్‌థింగ్ స్పెషల్ అనేలా, ప్రేక్షకులు అందరూ మాట్లాడుకునేలా ఉంటుంది. 'సరైనోడు'లో ఆయన చేసిన పాత్ర కంటే పదింతలు పవర్‌ఫుల్‌గా గురు పాత్ర ఉంటుంది. రామ్ - ఆది మధ్య సీన్స్ సినిమాకు హైలైట్ అవుతాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం" అని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆర్జే విజిల్ మహాలక్ష్మి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె లుక్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. ఇందులో అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.