తిరుపతి, మార్చి 2,
మంచు మోహన్ బాబు ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. ఆయన తన సొంత మండలం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వానికి చెందిన భూముల్ని తమపై రాయించుకున్నారని ఆన్ లైన్ చేయించుకున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మోహన్ బాబు పేరుపై రెండున్నర ఎకరాలు, ఆయన పెద్ద కుమారుడు విష్ణుపై దాదాపుగా మరో రెండెకరాల స్థలం ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఆన్ లైన్‌లో నమోదయింది. ఈ వివరాలు ఈ సేవ నుంచి బయటకు వచ్చాయి. ఇందులో ఆయనకు ప్రభుత్వం డి పట్టా ద్వారా ఇచ్చిందని తెలుపుతూ ఉంది. 2015లో ఇలా కేటాయించినట్లుగా రికార్డులలో ఉంది. డీ పట్టాలంటే ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోమని.. లేదా పొలం సాగు చేసుకోమని ఇచ్చే పట్టారు. సాధారణంగా బడుగు, బలహీనవర్గాలకు ఆదాయ వనరులు లేని వారికి ఇస్తారు. వీటిని అసైన్డ్ ల్యాండ్స్ అని కూడా అనొచ్చు. ఈ భూముల్ని మోహన్ బాబు ఫ్యామిలీకి ఎలా ఇచ్చారు ? ఏ ప్రాతిపదికన ఇచ్చారు ? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిందా లేకపోతే సొంతంగా అధికారులతో లాబీయింగ్ చేసుకుని ఆ భూమిని మోహన్ బాబు ఫ్యామీలీ సొంతం చేసుకుందా అన్నది తేలాల్సి ఉంది. మోహన్ బాబు కుటుంబం ఈ ఆరోపణలపై ఇంత వరకూ స్పందించలేదు. కానీ ఇది తీవర్మైన విషయంగా మారే అవకాశం ఉంది. ఆ భూమి మోహన్ బాబు, ఆయన కుమారుడిపై మారడం అనేది ఎవరి పని అనేది తేలేది క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే మరింత రాజకీయ వివాదం అవుతుంది. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులతో కుమ్మక్కయి ఆ భూమికి పత్రాలు సృష్టించుకుని ఉంటే మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీ తీవ్ర ఇక్కట్లలో పడినట్లే అనుకోవాలి. అయితే ఎవరూ చేయకుండా ఈ భూముల పేర్లు మోహన్ బాబు ఆయన కుటుంబసభ్యుల పేర్లపైకి మారే అవకాశమే లేదు. ఇది ప్రభుత్వ భూములు కాబట్టి ఈ విషయాన్ని ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వాలు విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. దీనిపై మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించి వివరణ ఇస్తే అనవసర ప్రచారాలకు తెరపడే అవకాశం ఉంది.