YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్

కయ్యానికి కాలు దువ్వుతున్న కేసీఆర్

హైదరాబాద్, మార్చి 2,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పట్టాన అర్థం కారు. ఆయన ప్రేమించినా అంతే. ధ్వేషించినా అంతే. మొన్నటి వరకూ మోదీతో ఆలింగనాలు చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు కయ్యానికి సిద్ధమయ్యారు. ఎంతవరకూ అంటే చివరకు గవర్నర్ ప్రసంగాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో వినిపించనంతగా. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు కాని, బడ్జెట్ సమావేశాలు అంటే గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానం పై చర్చ జరుగుతుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని సయితం కేసీఆర్ పక్కన పెట్టారు. కేసీఆర్ మూడో సారి తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఆయన రాజకీయంగా బలంగానే ఉన్నా. తొమ్మిదేళ్ల పాలన లో సహజంగా తలెత్తే అసంతృప్తిపైనే ఆయనకు భయం పట్టుకుంది అనుకోవాలి. అందుకే ప్రశాంత్ కిషోర్ టీంను వినియోగించుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ కు మించిన రాజకీయ వ్యూహకర్త ఎవరూ లేరు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని రెండు సార్లు తనకు పట్టం కట్టేలా రాజకీయం చేయగలిగారు. మూడోసారి ముచ్చటగా అందలం ఎక్కి రికార్డు సృష్టించాలన్నది కేసీఆర్ ఆలోచన. తెలంగాణలో బీజేపీ బలంగా లేదు. ఆ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఆ పార్టీ పై అభిప్రాయం మారింది. తాను సస్పెండ్ చేసిన నేతను అక్కున చేర్చుకున్న కారణమే కమలం పార్టీపై కేసీఆర్ కోపానికి అసలు కారణం. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశ అభివృద్ధి వంటి మాటలు హంబక్. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి ఆయనలో ఆగ్రహానికి, అసహనానికి కారణమయింది. ఇదే పరిస్థితి సాధారణ ఎన్నికల్లో రాకూడదని మరో సెంటిమెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదు. ఆంధ్ర పాలకులపై విమర్శలు వచ్చే ఎన్నికల్లో వర్క్ అవుట్ కావు. అందుకే ఆయన బీజేపీని ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కొంత వరకూ పనిచేస్తుందని ఆయన నమ్మకం కావచ్చు. బీజేపీ కొంత పెరిగినా కాంగ్రెస్ బలపడకూడదన్నది ఆయన వ్యూహం కావచ్చు. అందుకే సహజంగా ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో గొడవలకు దిగరు. అలా దిగే చంద్రబాబు గత ఎన్నికల్లో అన్ని రకాలుగా కష్టాలు పడ్డారు. ఆ సంగతి కేసీఆర్ కు తెలుసు. అయినా మొండిగా ముందుకు వెళుతున్నారు. పీకే సలహాలు, సూచనలు ఆయనపై ప్రభావం బాగానే చూపుతున్నాయని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

Related Posts