నిజామాబాద్, మార్చి 2,
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్టుగా రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను వీడి వెళ్లిన పలువురు నేతలు.. తిరిగి వచ్చేస్తారన్నది ఆ ప్రచార సారాంశం. దీంతో లోకల్ ఎమ్మెల్యే జాజల సురేందర్‌లో గుబులు మొదలైందని చెబుతున్నారు.ఎల్లారెడ్డి టీఆర్ఎస్ అడ్డా. 2009 నుంచి ఇక్కడ ఏనుగు రవీందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018లో మాత్రం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జాజల సురేందర్ చేతిలో ఓడిపోయారు. మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా సురేందర్ గులాబీ గూటికి చేరుకోవడంతో ఇరకాటంలో పడ్డారు రవీందర్‌రెడ్డి. ఒకే ఒక్క ఓటమితో అధికారపార్టీలో గుర్తింపు పోయిందని భావించారో ఏమో రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరిపోయారు. అప్పట్లో ఈటలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరికొందరు సైతం కాషాయ కండువా కప్పుకొన్నారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రెబల్ అభ్యర్థి రవీందర్‌సింగ్ టీఆర్ఎస్‌కు ఘర్ వాపసీ కావడంతో కొత్త చర్చ షికారు చేస్తోంది. రవీందర్‌రెడ్డి మిగతా నాయకులు తిరిగి గులాబీ గూటికి వచ్చేస్తారని ప్రచారం జోరందుకుంది.రవీందర్‌రెడ్డి టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే సురేందర్‌తో పడేది కాదు. ఇద్దరూ అధికారపార్టీలో ఉన్నప్పటికీ ఎవరి వర్గం వారిదే. ఎమ్మెల్యే మాటే ఫైనల్ కావడంతో జీర్ణించుకోలేకపోయేవారు రవీందర్‌రెడ్డి. పార్టీ పెద్దల అండతో సురేందర్ ఏదో నెట్టుకొచ్చినా.. తాజా ప్రచారం మాత్రం ఎమ్మెల్యేకు కునుకు లేకుండా చేస్తోందట. రవీందర్‌రెడ్డి తిరిగొస్తే తన పరిస్థితి ఏంటనే టెన్షన్‌లో ఉన్నారట. ఎమ్మెల్యే బాధ ఇలా ఉంటే.. జరుగుతున్న ప్రచారంపై రవీందర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారట. తాను బీజేపీని వీడే పరిస్థితే లేదని అనుచరులకు తేల్చి చెబుతున్నారట మాజీ ఎమ్మెల్యే. కావాలనే ప్రత్యర్థులు ఈ ప్రచారం తీసుకొచ్చారని.. ఇదో పెద్ద కుట్రగా ఆయన అనుమానిస్తున్నారట.రవీందర్‌రెడ్డి ఎంత చెప్పినా.. ఎన్ని వివరణలు ఇచ్చినా.. ఆయన కేడర్‌లో మాత్రం కొన్ని సందేహాలు అలాగే ఉన్నాయట. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని.. రవీందర్‌రెడ్డినే నమ్ముకున్న తమ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో అని అనుచరులు ఆందోళన చెందుతున్నారట. మొత్తానికి ఒక ప్రచారం..అటు ఎమ్మెల్యేలోనూ… ఇటు మాజీ ఎమ్మెల్యే శిబిరంలోనూ పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. ఎల్లారెడ్డి రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయో లేదో చూడాలి.