వాషింగ్టన్ మార్చ్ 2
అమెరికా ఉభయసభలను ఉద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడిన ఆయన ఆ మారణహోమానికి పుతిన్ కారణమన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. పుతిన్ ప్రభుత్వం అవినీతి అధికారులు, వ్యాపారవేత్తలతో భ్రష్టుపట్టిందన్నారు. రష్యాపై పోరులో యూరోప్ దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రష్యాకు చెందిన రాజకీయ సంపన్నుల వివరాలను తాము సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిపై త్వరలో ఆంక్షలను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో అమెరికా, నాటో దేశాలు ఒక్కటిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పుతిన్ భారీ మూల్యం చెల్లించుకుంటారని, చరిత్ర అదే చెబుతోందని, నియంతలు తమ దూకుడు తగ్గించకుంటే, దాంతో మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఉక్రెయిన్ విషయం పశ్చిమ దేశాలను అంచనా వేయడంలో పుతిన్ విఫలమైనట్లు ఆయన తెలిపారు.
రష్యాను ఢీకొట్టేందుకు తాము రెఢీగా ఉన్నామన్నారు. ఆరు రోజుల క్రితం స్వేచ్ఛా ప్రపంచ పునాదులను పుతిన్ కదిపారని, ఆయనకు తగినట్లు మార్చుకోవాలని చూశారన్నారు. కానీ పుతిన్ అంచనాలు దారుణంగా దెబ్బతిన్నట్లు బైడెన్ ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్ ప్రజలు రష్యా దూకుడు పట్ల బలమైన గోడలా నిలిచారని, దీన్ని పుతిన్ ఊహించలేకపోయినట్లు బైడెన్ తెలిపారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ప్రజలను కీర్తిస్తూ.. భయంలేకుండా, ధైర్యం, పట్టుదలతో ఉక్రేనియన్లు ప్రపంచానికి స్పూర్తిగా నిలిచినట్లు చెప్పారు. అమెరికా గగనతలంలో రష్యా విమానాలను నిషేధిస్తున్నట్లు బైడెన్ తెలిపారు.