విజయవాడ, మార్చి 3,
ఎవరు అవునన్నా.. ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే..! సీఎం జగన్ రెడ్డి, ఆయన వందిమాగధులు ఎంతలా రోడ్డెక్కి అమరావతి రాజధానికి వ్యతిరేకంగా కూతలు కూసినా.. అమరావతిని శ్మశానంతో పోల్చినా.. చంద్రబాబు నాయుడి హయాంలో జరిగిన నిర్మాణాలను ఎక్కడిక్కడే ఆపేసినా అమరావతే ఏపీ రాజధాని నగరం కానుంది! ఈ విషయం కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ రాజధాని నగరంలో సచివాలయం నిర్మాణానికి వెయ్యి 214 కోట్ల రూపాయలు కేటాయించింది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించేందుకు మరో వెయ్యి 123 కోట్ల రూపాయలు కేటాయించడం అమరావతినే రాష్ట్ర రాజధాని అని ధ్రువీకరించినట్లయింది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ భారీగా కేటాయింపులు చేసింది. ఈ మేరకు 2022-23 బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రొవిజన్ పెట్టడం విశేషం. ఏపీ రాజధాని ఏదో తెలియదు అన్నట్లు ఇంతవరకు వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతినే రాజధానిగాపేర్కొని, భారీగా కేటాయింపులు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ ప్రొవిజన్ నిధులను రాజధాని అమరావతిలో ఏయే పనులకు వినియోగించాలో అనే విషయంపైనా కేంద్రం పూర్తి స్పష్టత ఇచ్చింది. 2022-23 కేంద్ర బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారం.. ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణానికి వెయ్యి 214 కోట్లు, రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి వెయ్యి 123 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. జీపీఓఏకు భూసేకరణ వ్యయాన్ని 6.63 కోట్ల రూపాయలుగా కేంద్రం అంచనా వేసింది.ఇదిలా ఉంటే.. బడ్జెట్ లో కేటాయింపుల ప్రకారంగానే నిధులు విడుదల అవుతాయనే వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు మాత్రమే చేసి నిధులు విడుదల చేయని సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తుండడం గమనార్హం. మరి.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అంటూ మోడీ సర్కార్ చేసిన మేరకు నిధులను విడుదల చేయించుకునే విషయంలో జగన్ రెడ్డి సర్కార్ ఎంతవరకు సఫలం అవువుతుందో చూడాలని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అయితే.. అమరావతి అంటే ఆముదం తాగినట్టు మొహం పెట్టే వైసీపీ సర్కార్ రాజధాని సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధుల విడుదల చేయించుకునేందుకు మనసు పెట్టి ప్రయత్నిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉందని అంటున్నారు.