YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గన్నవరంలో టీడీపీకి దిక్కెవరు..?

గన్నవరంలో టీడీపీకి దిక్కెవరు..?

విజయవాడ, మార్చి 3,
కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. కమ్యూనిస్టు అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. అయితే.. మిగతా నియోజకవర్గాలన్నీ వేరు, గన్నవరం వేరు అన్నట్లు ఉన్నాయి తాజా సమీకరణాలు, 2014, 19 ఎన్నికల్లో టిడిపి నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో టిడిపికి అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు వంశీ. తరువాత కాలంలో ఏకంగా వైసీపీకి మద్దతు ప్రకటించి సొంత పార్టీకి ఝలక్ ఇచ్చారు. అప్పటి నుంచి టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి నేతలపై తనదైన శైలిలో మాటల దాడి చేస్తున్నారు. పార్టీ విధానాలు, లోపాలపై నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రి కొడాలి నానితో కలిసి టిడిపి టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు.ఇదంతా ఒక ఎత్తైతే.. టీడీపీ దారెటు అన్నది మరో ఎత్తు. వంశీ టిడిపికి దూరం కావడంతో.. ఆ పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. బలమైన కేడర్ ఉన్నా సరైన నాయకుడు లేకపోవడంతో కేడర్‌లో నిర్లిప్తత నెలకొందన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు చంద్రబాబు. బిసి సామాజిక వర్గానికి చెందిన నేత అయిన అర్జునుడుకి వల్లభనేనిని తట్టుకునే శక్తి, చరిష్మా లేదన్నది నియోజక వర్గంలో వినిపిస్తున్న టాక్. అందుకే టీడీపీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తుందట. వచ్చే ఎన్నికల్లో వంశీని ఎదుర్కొనేందుకు దీటైన అభ్యర్థి కోసం వెదుకుతుందట. సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా సమర్ధుడైన నాయకుడు కావాలనే కోణంలో ఆలోచన చేస్తోందట.టీడీపీ నుంచి గన్నవరంలో పోటీచేసేది ఎవరనే కోణంలో పలువురి నేతలు పేర్లు వినిపిస్తున్నా.. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని పార్టీ నేతలు బహిరంగంగా చెప్పకపోయినా.. గద్దె రామ్మోహన్ అయితే గెలుపు అవకాశాలు ఎక్కువని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇపుడు ఉన్న ఇన్‌ఛార్జ్ నామమాత్రమే. పైగా ఆర్థికంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదంటున్నారు. అయితే గద్దె తూర్పు నియోజకవర్గం వదిలి వెళతారా? అంటే ఇదో క్వశ్చన్‌ మార్క్‌గానే ఉంది. తూర్పు నియోజకవర్గంలో అతనికి మంచి పట్టుంది. అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే రామ్మోహన్ గన్నవరం వెళ్తారా అంటే.. ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు తమ్ముళ్లు. ఒకవేళ గద్దె విముఖత చూపితే.. మరో నేతను వెతుక్కోవాలి. మరి వంశీ ఓటమికి టిడిపి ఎలాంటి వ్యూహం రచిస్తుందో చూడాలి మరి.

Related Posts