కడప, మార్చి 3,
వివేకానందరెడ్డి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగిందా? బాబాయ్ కూతురు, వరుసకు చెల్లెలు అయిన సునీతారెడ్డికి జగన్ ఇంత ద్రోహం చేశాడా? ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ముందు సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం బయటికి వచ్చిన నేపథ్యంలో మున్ముందు ఇంకా ఏం జరగబోతోందనే ఆందోళన కూడా పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. వివేకానందరెడ్డి దారుణ హత్య వెనుక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం తప్పకుండా ఉండి ఉంటుందనే అనుమానాన్ని సునీత తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ తర్వాత సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజకీయంగా లబ్ధిపొందేందుకు వైఎస్ వివేకా హత్యకు జగన్ రెడ్డి ప్లాన్ వేసి ఉంటారని కూడా చెప్పారు.దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బుల్లితెర మీద ప్రత్యక్షం అయిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకంలో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పావులుగా మారిపోయారంటూ బట్ట కాల్చి ముఖం మీద వేసేశారు. బాబాయ్ హంతకులెవరో తేల్చే పని చూడకుండా బ్లేమ్ గేమ్ మొదలెట్టేశారు. తన తండ్రిని అవినాష్ రెడ్డి చంపాడని తాను అనుమానిస్తున్న కారణంగానే జగన్ భార్య భారతి తనను దూరం పెట్టేసినట్లు వివేకా కుమార్తె సునీత అంటున్నారు.నిజంగా వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు లేదా, సునీత చంపించి ఉంటే మీరెందుకు నేర ఘటనా స్థలంలో రక్తం తుడిచారో జవాబు చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చంద్రబాబు లేద సునీతే వివేకాను చంపించి ఉంటే.. ఆయన శరీరంపై గాయాలకు మీరెందుకు కట్లు కట్టారని నిలదీస్తున్నారు. ఒక వేళ వివేకాను చంద్రబాబు లేదా సునీత చంపితే మీరెందుకు గుండెపోటు అని ప్రచారం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.సజ్జల చేసిన బ్లేమ్ గేమ్ పై పలువురు టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇప్పుడు వివేకా కుమార్తె సునీతను ‘పావు’ అని ఆరోపించిన సజ్జల రామకృష్ణారెడ్డి రేపు జగన్మోహన్ రెడ్డి కన్న తల్లి విజయమ్మ, తోడబుట్టిన వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు పావులుగా మారారని అంటారేమో అని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. సజ్జల లాంటి నీచమైన క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదన్నారు. రేపు వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు పావులు అంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.‘ఏమిటి సజ్జలా.. వివేకా ఆత్మ క్షోభిస్తుందా? క్షోభించదా మరి.. అబ్బాయిలు వేసేస్తే ఏ బాబాయి ఆత్మ అయినా క్షోభిస్తుంది’ అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ట్వీట్ చేశారు. ‘ఆ రోజు వివేకా హత్యను చంద్రబాబే చేయించారని చెప్పడానికి లేని సిగ్గు.. ఈ రోజు సునీత జగనాసుర రక్త చరిత్ర బయటపెడితే వచ్చిందా?’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని దెప్పిపొడుస్తూ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ‘సిగ్గులు.. ఎగ్గుల గురించి సజ్జల.. ఆయన వెనుక ఉన్న జగన్ రెడ్డి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. సునీత తన తండ్రి హత్య విషయంలో ఉన్న అనుమానాలు సీబీఐకి చెబితే జగన్ అండ్ కో తట్టుకోలేకపోతున్నారు’ అని బీటెక్ రవి ట్వీట్ చేశారు. ‘అయ్యా.. అవినాష్ రెడ్డి వీళ్లు ఎంత ఉన్మాదులో చూశావుగా.. ఇంటి ఆడబిడ్డ సునీతను కూడా ఈ రోజు చంద్రబాబు పావు అన్నారు. రేపు నిన్ను ఏసేసినా ఏసేస్తారు. సీబీఐ వద్దకెళ్లి నిజం ఒప్పుకో’ అంటూ అమర్ నాథ్ రెడ్డి ట్విట్టర్ వేదిక తెలిపారు. దోషులను కాపాడాలని, సునీతను బలిచేయాలని సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. వివేకా హత్యతో జగన్ రాజకీయంగా లబ్ధి పొందారని, వివేకా హత్యకు కుటుంబ సభ్యులే కుట్ర చేశారంటే ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని అన్నారు. మొత్తం మీద దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసి ఆరోపణలపై టీడీపీ నేతలు ఒక్కసారిగా మీడియా.. సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి కొనసాగిస్తున్నారు.