విజయవాడ, మార్చి 3,
అంచెల వారీగా సంపూర్ణ మధ్య నిషేధం’, ఇది ఎన్నికల మాట. ‘మధ్యం ధరలు తగ్గించాం' మస్తుగా తాగండి’ ఇది ఇప్పుడు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో విజయవాడలోని హరిత హారం పార్కులో వెలిసిన స్వాగత తోరణాల సారాంశం. 2019 శాసన సభ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో, అంచెల వారీగా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసింది. అయితే, ఆ తర్వాత ఆమాటే మరిచి పోయింది. రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచెత్తింది. మద్యంపై వచ్చిన ఆదాయంతో ఖజానా నింపుకునేదుకు, కొత్త కొత్త పాలసీలను అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడేళ్ళు కాలేదు కానీ, మద్యం పాలసీని మూడు సార్లు మార్చింది. మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మూడు రెట్ల కంటే, ఎక్కువగానే పెరిగింది. అయినా, ఇంకా ఆదాయం చాలలేదో ఏమో, ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ' “మా బార్‌లో అన్ని రకాల మద్యం ధరలు తగ్గాయి” అని హరిత పార్క్ వెలుపలా , లోపలా ఫ్లెక్సీలు పెట్టింది. పార్కు లోపలకు వెళ్ళిన వారినే కాదు, ఆ రోడ్డున వెళుతున్న వారిని కూడా ఆకర్షించేలా అందమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.పార్కు స్వాగత ద్వారం మొదలు లోపలి వరకు అడుగడుగున ఈ బోర్డులే కనిపిస్తున్నాయి.పర్యాటక ప్రదేశంగానే కాకుండా, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు, భవానీ ఐలాండ్‌కు చేరుకునేందుకు, ఈ పార్క్ మార్గం కుండానే వెళతారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని పార్కుకు వచ్చి బోటింగ్ ద్వారా భవానీ ఐలాండ్‌కు చేరుకుంటారు. ఆవిధంగాను ఈ పార్కుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకునే గతంలో, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్(ఏపీటీడీసీ) 'ఇక్కడ మద్యం తాగరాదు' అని బోర్డులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే పర్యాటక శాఖ, ఆ బోర్డులను వెలవెల బోఎలా, 'మా బార్‌లో అన్ని రకాల మద్యం ధరలు తగ్గాయి' అని అందమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆదాయం కోసం ఈవిధంగా అడ్డ దారులు తొక్కడం ఇదే మొదటి సారి కాదు, ఓ వంక ఇంటి పన్ను మొదలు అన్ని రకాల పన్నులు పెంచుతోంది. గడచిన రెడ్నున్నర సంవత్సరాలలోనే వైసీపీ ప్రభుత్వం ఐదు రెట్ల వరకు ఇంటి పన్నుపెంచిందని తెలుగు దేశం పార్టీ తాజాగా ఆరోపిస్తోంది. ఇంకా చిత్రంగా సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించిన ప్రభుత్వం వారికి రోజు వారీ టార్గెట్లు ఫిక్స్ చేసింది. ఇప్పుడు ఇలా మందు తాగండని ప్రభుత్వమే ప్రచారం చేస్తోంది.