హైదరాబాద్, మార్చి 3,
తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది… అభివృద్ధిలో తనకు తానే సాటి అని మరోసారి రుజువు చేసుకుంది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనూ అగ్రస్థానంలో నిలిచి తమకు తిరుగులేదని నిరూపించుకుంది… ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) వెల్లడించింది.. 2021-22లో జీఎస్డీపీ వృద్ధిరేటు 14.7 శాతంతో పరుగులు పెట్టి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. తలసరి ఆదాయంలో సైతం 18.8 శాతం వృద్ధితో అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐదేండ్ల తలసరి ఆదాయం సగటు వృద్ధిరేటులోనూ మిగతా రాష్ర్టాలకు అందనంత ఎత్తులో నిలిచింది తెలంగాణ రాష్ట్రం.. దీంతో.. ట్విట్టర్‌లో తెలంగాణ ట్రెండింగ్‌లోకి వచ్చింది.. 50 వేలకు పైగా ట్వీట్లతో ట్విట్టర్‌లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తిపోయింది.. దేశ ప్రజలను, జాతీయ మీడియాను కూడా ఆకర్షిస్తోంది. TriumphantTelangana హ్యాష్ ట్యాగ్‌తో పాటు #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ కూడా హోరెత్తించారు నెటిజన్లు..ఆర్ధిక వృధ్దిరేటులో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడం పట్ల రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధుల పాటు.. పలువురు ప్రముఖులు, యువత దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించడం పట్ల తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు.. తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును, వివక్షను పెద్దఎత్తున ఎండగడుతున్నారు నెటిజన్లు.. ఇక, తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతిని సాధించి దేశానికే దిక్సూచిగా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఆర్ధిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఎంతో మంది రియాక్ట్ అయ్యారు.. తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించారు.. మొత్తంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. ఎదిగిన తీరు, సాధించిన అభివృద్ధిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు