న్యూఢిల్లీ మార్చ్ 3
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆదేశించగలమా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్వేదం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ ఆయన సుప్రీంకోర్టులో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపు విషయంలో ఓ న్యాయవాది ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం వీలైనంత చేస్తున్నట్లు ఆ ధర్మాసనం వెల్లడించింది. ఈ సందర్భంలో సీజేఐ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
భారతీయ విద్యార్థుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు సీజే తెలిపారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేస్తున్నట్లు ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశానని, సీజేఐ ఏం చేస్తున్నారని ఆ వీడియోలో ఒకరు అడిగారని, కానీ యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్‌ను ఆదేశించగలనా అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే వేల మంది భారతీయ విద్యార్థుల్ని ఆపరేషన్ గంగాలో భాగంగా ఇండియాకు తీసుకువచ్చారు. ఇవాళ మరో 8 విమానాల్లో సుమారు 3726 మందిని ఇండియాకు తీసుకురానున్నట్లు కాసేపటి క్రితం కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తెలిపారు.
బుచారెస్ట్ నుంచి 8, సుసేవా నుంచి రెండు, కోసి నుంచి ఒకటి, బుదాపెస్ట్ నుంచి 5, రెజస్వో నుంచి మూడు విమానాలను బయలుదేరనున్నట్లు మంత్రి సింథియా చెప్పారు.