న్యూయార్క్ మార్చ్ 3
రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో జనం వలస వెళ్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి పది లక్షల మంది వీడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వలస బాట పట్టిన జనమంతా సమీప దేశాలకు వెళ్తున్నట్లు యూఎన్ చెప్పింది. గత గురువారం రష్యా తన సైనిక బలగంతో ఉక్రెయిన్‌పై దండెత్తిన విషయం తెలిసిందే. అయితే కేవలం వారం రోజుల్లోనే పది లక్షల మంది వలస వెళ్లడం పట్ల యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యూఎన్ రెఫ్యూజీస్ హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండీ ఓ ప్రకటన చేశారు. తుపాకులు మూగబోవాలని, అప్పుడే మానవ సాయం అందే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో అంతర్గతంగా సుమారు ఒక కోటి రెండు లక్షల మంది స్థానచలనం జరిగే అవకాశం ఉన్నట్లు యూఎన్ ఏజెన్సీ అంచనా వేసింది.