నిర్మల్ మార్చ్ 3
ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. బాసరలో జంక్షన్‌లో శివాజీ విగ్రహాన్ని మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు ప్రసంగించారు. పరిపాలన, యుద్ద నైపుణ్యంలో అన్నింటా శివాజీ ఆదర్శమని కొనియాడారు. మత సామర్యాన్ని చాటారు. ప్రజలే ప్రభువులుగా ఆయన పాలన సాగిందన్నారు. శివాజీ ఎన్నో యుద్దాలు చేసినా హింసను ప్రోత్సహించలేదు.. పవిత్ర స్థలాలు ధ్వంసం చేయలేదని హరీశ్‌రావు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడంలో శివాజీని స్ఫూర్తిగా తీసుకున్నారని పేర్కొన్నారు. అహింసా మార్గంలో 14 ఏండ్లు కేసీఆర్ పోరాటం చేసి.. తెలంగాణ సాధించి.. అద్భుత పాలన అందిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. బాసర జంక్షన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఇక్కడి పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని హరీశ్‌రావు గుర్తు చేశారు.