పోలవరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులు 97 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తి అయ్యాయి. స్పిల్ వే లో 3,30968 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసారు. స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చడం జరిగింది.మిగిలిన 6 గేట్లను అమర్చే పనులు చురుకుగా సాగుతున్నాయి. రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను ఇప్పటికే అమర్చడం పూర్తి అయింది. అదేవిధంగా 10రివర్ స్లూయిజ్ గేట్లను,వాటికి 20హైడ్రాలిక్ సిలిండర్ల తో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చడం పూర్తి అయింది. స్పిల్ వే లో కీలకమైన ఫిష్ ల్యాడర్ పనులు సైతం దాదాపు పూర్తి కావొచ్చాయి. స్పిల్ వే భద్రతకు సంబందించి ఎడమవైపున గైడ్ బండ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్పిల్ ఛానెల్ లో 88.89% కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 81.38% పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. స్పిల్ ఛానెల్ లో కీలకమైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణం సైతం ఇప్పటికే పూర్తయ్యింది. ఇంక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 74.44 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి అయింది. ఎగువ కాఫర్ ఢ్యాం ను 2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు న పూర్తి స్దాయి లో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. జూన్-11-2021న గోదావరి నదీ సహాజ ప్రవాహాన్ని అప్రోచ్ ఛానెల్ మీదుగా స్పిల్ వే వైపు మళ్ళించడం జరిగింది.ఇలా అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6కి.మీ మళ్ళించడం జరిగింది. (చరిత్రలో మొదటి సారి గోదావరి నదీ ప్రవాహాన్ని కుడివైపు నుండి ఎడమవైపు దాదాపు 6.6 కి.మీ దారిమళ్ళించడం ఇంజనీరింగ్ అద్భుతం-ఒక నదీ ప్రవాహాన్ని గత యేడాది లో 25రోజుల పాటు నిలిపివేయడం జరిగింది. ఇంక దిగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. దిగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులు దాదాపు 84.33% పూర్తయ్యాయి. త్వరలోనే దీని నిర్మాణం కూడా పూర్తి కానుంది. ఇటీవలే గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం సైతం పూర్తిచేసారు.
ఇప్పటికే గ్యాప్2లో ఈసిఆర్ఎఫ్ డ్యాం నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు అనగా దాదాపు 75శాతం పనులు పూర్తి అయ్యాయి. అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. గ్యాప్-2 మెయిన్ డ్యాం ఏరియాలో పనులకు అనుకూలంగా ముందుగా నదిలో నీటిని తోడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్యాప్-1లో 400 మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ ఢ్యాం నిర్మాణం పూర్తి అయింది. గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా,కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు సైతం దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంక కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు 99.37% పూర్తయ్యాయి. జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ఇప్పటికే పూర్తి చేసారు. ట్రైల్ రేస్ ఛానెల్ లో మట్టితవ్వకం పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి.