రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న ప్రారంభమయిన రష్యా దాడుల్లో ఇంతవరకు రెండు వేలకు పైగా మరణించారు. తొమ్మిది రోజుల యుద్దంలో తొమ్మిది వేలమంది రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రేయిన్ ఆధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. అయితే ఈ వార్తలను రష్యా ఖండించింది. మా సైనికులు 498 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. ఇరువర్గాల పోరులో నిత్యం వందలాది మంది సైనికులు, ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా రష్యా బలగాలు ఉక్రెయిన్లో తీవ్ర దాడులకు తెగబడుతున్నాయి. రష్యా సేనలు, కొంత పట్టుసాధిస్తున్నప్పటికీ భారీ స్థాయిలో సైనిక, ఆయుధ నష్టాలను చవిచూస్తోందని ఉక్రెయిన్ రక్షణశాఖ వెల్లడించింది. రష్యాన్ సేనల దాడుల తరువాత జపోరిజ్జియా అణు కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ అణు కేంద్రం యూరప్ లోనే అతి పెద్దది. అంతకుముందు అక్కడ ఇరు సైన్యాల మధ్య భీకర పోరు జరిగింది.