గాంధీనగర్, మార్చి 4,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వ్యూహకర్త. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. 2018 లో ఇంకా ఏడాది సమయం ఉండగానే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లిపోయారు. అప్పుడు ఎవరూ ఊహించలేదు. అయితే అప్పట్లో ఆయన స్ట్రాటజీ ఫలించింది. అయితే ఆరు నెలల్లోనే వచ్చిన లోక్ సభలో మాత్రం బీజేపీ నాలుగు స్థానాలు దక్కించుకుంది. చివరకు తన కుమార్తె కవిత కూడా పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఏ గొడవలుండవ్ అయితే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆయన మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా దానిని ఖండిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఊపందుకుంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ న్యాయనిపుణులతో సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలు సకాలంలో జరిగేందుకు ఎమైనా ఆటంకాలు ఉంటాయా? అన్న సందేహాలను ఆయన తీర్చుకున్నట్లు చెబుతున్నారు. నిజానికి కేసీఆర్ కు మరో రెండేళ్ల పదవీకాలం ఉంది. ఇంకా అనేక పథకాలను ఆయన గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు తగిన సమయం కూడా కావాలి. దళితబంధు వంటి పథకాలను గ్రౌండ్ చేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళితే టైం చాలినంత ఉండదు. అయినా తాను తిరిగి అధికారంలోకి వస్తే దళితబంధు పథకాన్ని ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబానికి వర్తింప చేస్తానని హామీ ఇచ్చి వెళతారంటున్నారు. ఈ ఏడాదిలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలతో పాటే కేసీఆర్ వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. గుజరాత్ ఎన్నికల సమయంలో అయితే మోదీ, అమిత్ షా దృష్టి అంతా అక్కడే ఉంటుందని, తెలంగాణ ఎన్నికలను పెద్దగా పట్టించుకోకపోవచ్చన్న ఆలోచనతోనే ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అదే జరిగితే ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి