YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో బీహారీ... సెటిల్ మెంట్స్

తెలంగాణలో బీహారీ... సెటిల్ మెంట్స్

హైదరాబాద్, మార్చి 4,
కేస్ స్టడీ 1: తెలంగాణలో బీహార్ ఐఏఎస్, ఐపీఎస్ లకు అధిక ప్రాధాన్యం.. సీఎస్ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్ తదితరులు కీలక స్థానాల్లో ఉండటం.. డీజీపీగా అంజనీకుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించడం.. ఇలా బీహార్ తరహా అరాచక పాలన సాగించేందుకే.. సీఎం కేసీఆర్ బీహారీ అధికారులను తనచుట్టూ కవచంలా ఉంచుకున్నారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు, బీహార్ కే చెందిన ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ గా కేసీఆర్ కోసం రంగంలోకి దిగడం మరింత ఆసక్తికరం. నిజంగానే తెలంగాణలో బీహారీల పాలన నడుస్తోందా? అనే ప్రచారం. అందుకు తగ్గట్టే.. 'వెలమ' కమ్యూనిటీ బీహార్ నుంచి వలస వచ్చినట్టు.. గతంలో ఎప్పుడో కేసీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో లేటెస్ట్ గా వైరల్ కావడం మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
కేస్ స్టడీ 2: ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ తో సహా మరో ముగ్గురి కిడ్నాప్ జరగడం.. అంతకుముందు పాలమూరులోనూ ఓ ముగ్గురు కనిపించకుండా పోవడం.. వారందరినీ మఫ్టీలో వచ్చిన పోలీసులే అరెస్ట్ చేశారని తెలుస్తుండటం.. ఈ కిడ్నాపుల డ్రామా అంతా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన ఆ మంత్రి డైరెక్షన్ లో జరుగుతోందనే ప్రచారం.. ఇదంతా చూస్తుంటే ఇది తెలంగాణనా? బీహారా? అనే అనుమానం రాకమానదు.
కేస్ స్టడీ 3: హైదరాబాద్ శివార్లలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. ఇబ్రహింపట్నంలో పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు రియల్టర్లను కాల్చి చంపడం.. నిందితులను ఇప్పటికీ పట్టుకోకపోవడం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు భారీగా జరుగుతుండటం.. పదే పదే కాల్పుల శబ్దాలతో మాఫియా గ్రూపులు చెలరేగిపోతుండటాన్ని ఏమనుకోవాలి? నగరంలో ఇంత ఈజీగా తుపాకులు ఎలా దొరుకుతున్నాయి? అందులోనూ కంట్రీ మేడ్ గన్స్? తుపాకులతో చెలరేగిపోవడానికి ఇదేమైన బీహారా? మరీ ఇంత అరాచకమా?
కేస్ స్టడీ 4: నిర్మల్ లో ఓ బాలికపై.. మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ అత్యాచారం చేయడం మరింత దారుణమైన విషయం. ఆ కేసులో ప్రధాన నిందితుడు టీఆర్ఎస్ నాయకుడు, నిర్మల్‌ పురపాలక సంఘం వైస్‌ ఛైర్మన్‌ సాజిద్‌ ఖాన్‌ కావడం అధికార పార్టీ నేతల బీహార్ తరహా ఆగడాలకు నిదర్శనం అంటున్నారు. షేక్‌ సాజిద్‌పై గతంలో పలు కేసులు ఉన్నా కూడా.. ఆయనకు ఆ పదవి కట్టబెట్టడం ఏంటనే విమర్శలు ఉన్నాయి. షాపింగ్ పేరుతో 16 ఏళ్ల బాలికను నిర్మల్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లి రే-ప్ చేశాడు ఆ దుర్మార్గుడు. నెల రోజుల తర్వాత తీరిగ్గా ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇలాంటి ఘటనలు చూస్తుంటేనే.. ఇది తెలంగాణనా? బీహారా? అనే అనుమానం వస్తోందంటున్నారు ప్రజలు.
1.. 2.. 3.. 4.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటాయి. ఇవన్నీ ఇటీవల జరిగిన ఘటనలే. ఇంకా గతానికి వెళితే.. లెక్కకు మిక్కిలి ఉంటాయి బీహార్ తరహా కేసులు. మంథనిలో లాయర్ దంపతులను నడిరోడ్డు మీద నరికి చంపడం.. అందులో అధికార పార్టీ నేతనే ప్రధాన సూత్రధారి కావడం.. తదితర సంఘటనలు కోకొల్లలు. ఇసుక లారీలను అడ్డుకుంటున్నాడని.. దళితుడిని సజీవ దహనం చేయడం.. దొంగతనం కేసులో దళితుల లాకప్ డెత్ లాంటి దారుణాలు.. పసిబిడ్డలపై అఘాయిత్యాలు.. కొత్తగూడెంలో వనమా రాఘవ లాంటి రాబంధుల ఆగడాలు.. అబ్బో బీహారీ తరహా ఘటనలకు తెలంగాణలో కొదవే లేదు.
ఢిల్లీ వెళ్లి మరీ తెలంగాణ ఉద్యమ కారుడైన మున్నూర్‌ రవిని కిడ్నాప్ చేయడాన్ని ఎలా చూడాలి? ఆ కిడ్నాప్ పోలీసులే చేశారంటే.. బీహార్ తరహాలోనే ఖాకీలు ఖద్దరు నాయకుల గుప్పిట్లో ఉన్నారనక ఏమనాలి? గులాబీ కండువా కప్పుకొని.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వనమా రాఘవ.. అలా చెలరేగిపోతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేసినట్టు? రే-ప్ లు, మహిళలపై దారుణాలు.. గ్యాంగ్ వార్ లు.. గన్ కల్చర్.. విచ్చలవిడిగా పేట్రేగిపోతుంటే తెలంగాణలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా? ఇదేమైన బీహారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇక రాజకీయాల్లోనూ బీహార్ మార్క్ సుస్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ రాకతో అది మరింత పెరిగిందని చెబుతున్నారు. బీహార్ బ్రాండ్ ఐఏఎస్, ఐపీఎస్ లకే ప్రాధాన్యం ఇస్తూ.. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఇక, కేసీఆర్ పూర్వికులే బీహారీలని స్వయంగా ఆయనే చెప్పడం.. ఇప్పటికే రెండుసార్లు అవకాశం ఇచ్చాం.. ఇంకోసారి బీహారీ పాలన అవసరమా? అని రేవంత్ రెడ్డి కొత్త చర్చ లేవనెత్తడం.. తెలంగాణలో రచ్చ రేపుతోంది. నిజమేగా? అంతేగా? అనే అభిప్రాయం పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.

Related Posts