YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత

తిరుమల
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం, రుచికర అన్నప్రసాదాలు అందించనున్నట్లు టిటిడి ఛైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి  తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పిఏసి - 4 (పాత అన్నప్రసాద భవనం) లోని లగేజి సెంటర్ను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి ఛైర్మన్  తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్   మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పదిరోజులవుతోందన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా  అల్ఫాహరం, అన్నప్రసాదాలు అందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.        అదేవిధంగా ఉత్తర భారతదేశం నుండి వచ్చే భక్తులకు భోజనంతో పాటు  రొట్టెలు, చపాతీలను అందిస్తామన్నారు. తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు  అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు సామాన్య భక్తులకు అందించే ఆర్జిత సేవలు, దర్శనాల ధరలను టిటిడి పెంచలేదని,పెంచే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ధరల పెంపుపై కేవలం చర్చ  మాత్రమే పాలకమండలిలో జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టిటిడి పాలకమండలి ముఖ్య ఉద్దేశమని, ఇందులో భాగంగా ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలను రద్దు చేశామని, దీని వల్ల సర్వదర్శనం టోకెన్లు పొందే సామాన్య భక్తులకు అదే రోజు దర్శనం జరుగుతోందని  సుబ్బారెడ్డి వివరించారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Related Posts