ఏలూరు, మార్చి 5,
కొత్తపల్లి సుబ్బారాయుడు సీనియర్ నేత, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన మూడు పదవులను అనుభవించారు. అదే సమయంలో ఆయన నాలుగు పార్టీలు మారారు. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ ల తీర్థం పుచ్చుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే అనిపిస్తుంది. ఆయన నర్సాపురంనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తున్నారు. వైసీపీలో ఉండి ఆయన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నరసాపురం నుంచి ముదునూరు ప్రసాదరాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో బహిరంగ సభలో కొట్టుకున్నారు. ఇది పార్టీ మారేందుకు సంకేతమనే అంటున్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళతారన్నది పక్కన పెడితే ఎన్నికలకు ముందు పార్టీ మారడం కొత్తపల్లి సుబ్బారాయుడుకు అలవాటు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం నుంచే ఆయన రాజకీయాలను ప్రారంభించారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. నరసాపురం ఎంపీగా గెలిచిన చరిత్ర కొత్తపల్లి సుబ్బారాయుడిది. నాలుగు పార్టీలు మారి... 2004లో టీడీపీ ఓడిపోయినా కొత్తపల్లి సుబ్బారాయుడు మాత్రం విజయం సాధించారు. 2009లోె ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి మళ్లీ ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ టీడీపీలో చేరిపోయారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. మరోసారి కొత్తపల్లి సుబ్బారాయుడి మనసు మారింది. 2019 ఎన్నికలకు ముందు ఆయన తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. టిక్కెట్ దక్కకపోయినా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేశారు. వైసీపీలోకి వచ్చినా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడినట్లే కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీ మారతారో ఆయనకే తెలియదు. ఈసారి ఏ పార్టీలోకి మారతారన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన వైపు చూస్తున్నారని కొందరు చెబుతున్నారు. జనసేన, టీడీపీ పొత్తులో తాను ఎమ్మెల్యే అవుతానని ఆయన భావిస్తున్నారు. మొత్తం మీద జనసేనలోకి జంప్ చేస్తే ఏపీలో ఉన్న అన్ని పార్టీలూ ఆయన మారి రికార్డు సృష్టించినట్లేనని అనుకోవాలి.