విజయవాడ మార్చి 5,
శివాజీ మళ్లీ వచ్చారు. ఆపరేషన్ గరుడ 2.O ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈసారి అంతకుమించి అంటున్నారు. వైసీపీకి బిగ్ షాక్ తగలనుందని సంచలన వార్త మోసుకొచ్చారు. ఒకరు ఇద్దరు కాదు.. అధికార పార్టీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు.. వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని పొలిటికల్ బాంబ్ పేల్చారు. రాబోయే రోజులు వైసీపీకి గడ్డు రోజులని.. ఓటుకు 50 వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని శివాజీ అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోందని.. మూడు రాజధానుల అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని శివాజీ అన్నారు. శివాజీ అన్నారంటే.. అందులో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. అందుకే, జగన్ సర్కార్ ఉలిక్కిపడుతోంది. వైసీపీలో వణుకు మొదలైంది. మందడంలో అమరావతి రైతులు నిర్వహించిన విజయోత్సవ సభకు సినీనటుడు శివాజీ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంటారని శివాజీ చెప్పారు. అమరావతియే రాష్ట్ర రాజధానిగా అటు కేంద్రం, ఇటు న్యాయస్థానాలు గుర్తించాయని.. కానీ జగన్ మాత్రం గుర్తించడం లేదని విమర్శించారు. అమరావతి విషయంలో కుల ప్రస్తావన తీసుకువచ్చారని.. ఈ రోజుల్లో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని శివాజీ ప్రశ్నించారు. కోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్ మనసు మార్చుకోవాలని శివాజీ హితవు పలికారు. రాష్ట్రం అంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ రాజధాని విషయంలో పోరాడేందుకు కలిసి రావాలని.. అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ప్రజా వేదికను కూల్చిన రోజే ప్రజలు ప్రశ్నించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. అమరావతి ఉద్యమ స్ఫూర్తితోనైనా ప్రజలంతా కలిసి రావాలని సూచించారు.జనసేన పార్టీ, టీడీపీలకు రాష్ట్ర భవిష్యత్ గురించి పట్టదా అంటూ శివాజీ ప్రశ్నించారు. ప్రతిసారి కోర్టుల జోక్యం కుదరదని అయితే ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత విపక్షాలకు ఉందని శివాజీ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను సాధిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్.. సీఎం అయ్యాక హోదాపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయని శివాజీ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రత్యేక హోదా సాధన విషయంలో సీఎం జగన్ ఏం చెప్తారని నిలదీశారు. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలే రాజకీయాలను కలుషితం చేస్తున్నారనీ విమర్శించారు. వ్యాపార వేత్తలు రాజకీయాలకు దూరంగా ఉంటే ఈ దేశానికి ఎలాంటి సమస్యలు రావని ప్రజలంతా సంతోషంగా ఉంటారంటూ శివాజీ అన్నారు