YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పైకి మేకపోతు గాంభీర్యం... కిం కర్తవ్యం

పైకి మేకపోతు గాంభీర్యం... కిం కర్తవ్యం

విజయవాడ, మార్చి 5,
కింకర్తవ్యం.. ఏమిటి చేయడం? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందున్న పెద్ద ప్రశ్న ఇది.రాష్ట్ర రాజధాని విషయంలో, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కార్ ‘ కు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. నిజమే, ఇలాంటి తీర్పు ఏదో వస్తుందనే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముందుగానే మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహిరించుకుంది. సీఆర్డీఏ చట్టాన్ని కోర్టు గడప దాటించే ప్రయత్నం చేసింది. కానీ, కుదరలేదు. ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకోవడం వెనక ఉన్న ఉద్దేశాలను హైకోర్టు గుర్తించింది. సర్కార్ వెనకడుగు వేసింది, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ఫై మరింత బలంగా పంజా విసిరేందుకే అనే నిజాన్ని, సర్కార్ నైజాన్ని న్యాయస్థానం గ్రహించింది. నిజానికి అందులో దాపరికం ఏమీలేదు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు ఎవరి భాషలో వారు, చట్టాన్ని వెనక్కి తీసుకున్నా మూడు రాజధానుల సంకల్పం మారలేదని చెపుతూనే ఉన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులకు తమ ప్రభత్వం కట్టుబడి ఉందని, వాదిస్తూనే వచ్చారు. చివరకు, కోర్టు సమర్పించిన అఫిడవిట్’లోనూ అదే విషయం బ్లాక్ అండ్ వైట్’లో చూపించారు. అందుకే, ప్రభుత్వం చట్టాన్ని ఉపసంహరించుకున్నా, న్యాయస్థానం అదే చట్టం పై రైతులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ కొనసాగించి, సహజ న్యాయానికి దగ్గరగా ఉండే సంచలన తీర్పును ఇచ్చింది.తాజా తీర్పులో రాష్ట్ర హై కోర్టు, సర్కార్ దృఢ /దృష్ట సంకల్పం అడుగులు ముందు పడకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేసింది.నిజానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురుదెబ్బ. ఇంకా గట్టిగా, స్పష్టంగా చెప్పాలంటే చెంప దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. అదలా ఉంటే, ఈ చిక్కులలోంచి బయట పడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం సహా అనేక ప్రత్యాన్మాయాలను అలోచిస్తునట్లు తెలుస్తోంది. అయితే, జగన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని విషయంలో ఇప్పటికే పీకలలోతుకు మునిగిపోయింది, తనకు తానుగా సృష్టించుకున్న చిక్కుల్లోంచి బయటపడడం అయ్యే పని కాదని న్తున్నారు. ఒక విధంగా రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని అన్నిపక్కల నుంచీ కట్టడి చేసిందని అంటున్నారు.  భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా రాజధాని నగరాన్నీ, ప్రాంతాన్నీ అభివృద్ధిచేయాలన్న హైకోర్టు ఆరునెలల్లో మాస్టర్ ప్లాన్ అమలు పూర్తిచేయాలనీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, కనీసావసరాలు తీర్చడం నెలరోజుల్లో జరగాలని ఆదేశించింది. భూములు ఇచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధిపరచిన ప్లాట్లు మూడునెలల్లో అప్పగించాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు తనకు నివేదికలు ఇస్తుండాలని నిర్దేశించింది. అంటే ఒక విధంగా న్యాయస్థానం ప్రభుత్వాన్ని గట్టిగా కట్టి పడేసిందని అనుకోవచ్చునని అంటున్నారు.  నిజమే, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కొందరు మంత్రులు ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ విధానమని పాత పాటనే మళ్ళీ ఎత్తుకున్నారు. అలాగే, రాష్ట్ర హై కోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళతామని ప్రకటించారు. నిజానికి, ఇది దింపుడు కళ్ళెం ఆశా లేక నిజంగా అలాంటి ఆవకాశం ఉందా? అంటే న్యాయనిపుణులు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళినా, వెళ్ళక పోయినా, జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్తగా ఎలాంటి ఊరట ఉండక పోవచ్చనే అంటున్నారు. అందుకే కావచ్చును ప్రభుత్వం కూడా, తుది నిర్ణయం విషయంలో కిందా మీదా అవుతోందని అధికార వర్గాల సమాచారంగా వుంది.  ఇంతవరకు జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడు ముక్కలాటను ఇష్టా రాజ్యంగా నడిపించింది. దాదాపు 800 రోజులకు పైగా విభిన్న రూపాల్లో ఉద్యమాలు చేస్తున్న అమరావతి రైతులను, మహిళలను అనేక విధాల వేధింపులకు గురిచేసింది. అయినా,  చివరకు కోర్టు తీర్పురూపంలో ధర్మం జయించింది.అందుకే, ఇప్పటికైనా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం,అధికార పార్టీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానుల మంకు పట్టును వదిలి కోర్టు తీర్పును గౌరవించడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు. గత రెండున్నరేళ్ళుగా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో, రాజధాని నిర్మాణం అడుగు ముందుకు సాగలేదు. రాష్ట్రం రాజధాని లేని అనాధగా మిగిలిపోయింది. ఈనేపధ్యంలో రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపించినా, నిజానికి అది ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు కాదు. ఇంకా మాట్లాడితే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి హై కోర్టు ఒక సువర్ణ అవకాశం కలిపించింది. ఇక ఈ అవకాశాన్ని. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇపుడు జగన్ రెడ్డి చేతిలోనే వుంది. ఎప్పటిలా మొండికి పోతే, రాష్ట్రం తీవ్రం నష్టపోతుందని అంటున్నారు.

Related Posts