YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఏడాదిన్నర ముందే రాజకీయ వేడి

ఏడాదిన్నర ముందే రాజకీయ వేడి

హైదరాబాద్, మార్చి 5,
ఎండా కాలం రానే లేదు.. ఇంకా వేడి పెరగనే లేదు.. వేసవి సీజన్ ప్రారంభానికి ముందే విపక్షాలు స్వరం పెంచటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే.. మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలను తలపించేలా.. విమర్శలు, ఆరోపణలతో ఒకరిపై ఒకరు మాటలతో ఎదురుదాడి చేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, వారి బంధువుల అవినీతి, అక్రమాలు, భూక‌బ్జాలు, దందాలు, బినామీ కాంట్రాక్టులపై ప్రతిపక్ష నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అధికార పార్టీని అంతర్మథనంలో పడేయగా.. ఆత్మరక్షణగా ఎదురుదాడి చేస్తున్నారు. బహిరంగ చర్చకు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నా.. విమర్శలు, ఆరోపణలకే పరిమితమవుతున్నారు. టీఆర్ఎస్-కాంగ్రెస్, టీఆర్ఎస్-బీజేపీ మధ్య పరస్పర విమర్శలతో మాటల యుద్ధం మొదలైంది.నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డిపై.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు క‌మిటీ చైర్మన్ ఏలేటీ మ‌హేశ్వర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు, ఆరోప‌ణ‌లతో ఒక్కసారిగా రాజకీయంగా హీట్ పెంచేశారు. మంత్రి అల్లోల, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు సర్కారు భూములను కబ్జా చేస్తున్నారని.. డీ-వన్ పట్టాల పేరుతో దందా చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. 1500 ఎకరాల భూమిని కబ్జా చేశారని.. ఈ చిట్టా మొత్తం తన వద్ద ఉందన్నారు. నిర్మల్ చెరువుల క‌బ్జాలు, మంత్రి అండ చూసుకుని రెచ్చిపోతున్న క్యాడ‌ర్ అరాచ‌కాలు, మున్సిప‌ల్ వైస్ చైర్మన్ అత్యాచార ఘ‌ట‌న‌పై ఏలేటి అటాక్ చేశారు. జెడ్పీ చైర్‌ప‌ర్సన్ భ‌ర్త దివ్య గార్డెన్ వ‌ద్ద ప్రభుత్వ భూములు క‌బ్జా చేశార‌ని ఆరోపించారు. ప్యాకేజీ-28 రూ.700కోట్ల పనులను అర్హత లేని, బీనామీ బోగస్ కంపెనీకి అప్పగించారని.. చనాక కొరటా పనులు తమ తమ్ముడికి ఇప్పించారని.. చేసిన పనులనే మళ్లీ చేయటం, పనులు చేయకుండానే బిల్లులు ఎత్తుతున్నారంటూ ఆరోపణలు చేశారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిరూపించకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. దీంతో మంత్రి అల్లోల కౌంట‌ర్ ఇవ్వగా.. నిర్మల్‌లో కాంగ్రెస్ స‌భ అట్టర్ ఫ్లాఫ్ అయిందని, రెండు సార్లు జనం ఛీ కొట్టిన బుద్ధి రాలేద‌ంటూ పేర్కొన్నారు.మంచిర్యాలలోనూ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య కౌంట‌ర్‌, ఎన్‌కౌంట‌ర్‌ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు, ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. నడిపెల్లి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని, ఆ డబ్బులు ఎక్కడివని, తన వద్ద మొత్తం చిట్టా ఉందని కొక్కిరాల విమర్శించారు. దీంతో కొక్కిరాల భూక‌బ్జా కోర‌ని, పెద్ద ఎత్తున అప్పులు చేశార‌ని నడిపెల్లి కౌంట‌ర్ అటాక్ చేశారు. దీంతో ఆస్తులు, అప్పులు, భూకబ్జాలు, దందాలపై ఇద్దరి మ‌ధ్య వాగ్వావాదం తారాస్థాయికి చేరగా.. తాను చ‌ర్చకు సిద్ధమ‌ని స‌మ‌యం, ఎక్కడ చ‌ర్చ చేద్దామో..? చెప్పాల‌ంటూ కొక్కిరాల స‌వాల్ విసిరారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అనుచరులతో సపర్యలు చేయించుకుంటారని.. ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. కాంగ్రెస్ మహిళా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించటంతో.. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య తోపులాట, ఉద్రిక్తతకు దారి తీసింది.ఆదిలాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ఆర్వోబీ నిధులను కేంద్రం ఇచ్చినా.. రాష్ట్రం ఇవ్వటం లేదని బీజేపీ విమర్శలు చేయటంతో పంచాయతీ మొదలైంది. రాష్ట్ర వాటా నిధుల కోసం మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా అస్త్రం సంధించారు. నిధులు వచ్చాక ఎమ్మెల్యే జోగు రామన్న.. బీజేపీపై సీసీఐ తెరిపించాలని ఎదురుదాడికి దిగింది. అఖిలపక్షం ఏర్పాటు చేసి.. సీసీఐ సాధన సమితి పేరుతో దీక్షలు, ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. జైనథ్ మండలం యాపల్ గూడలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంటనీ.. బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసినిరెడ్డి తెరపైకి తెచ్చారు. సెల్ఫీ విత్ ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అంటూ సుహాసినిరెడ్డి ప్రజా సమస్యలపై పోరుబాట పట్టారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవం రెండు పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్యానికి వేదికగా మారింది. టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు, వారి కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యే అనుచ‌రులు భూ క‌బ్జాలు, ఇల్లీగ‌ల్ దందాల‌పై బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ కార్యాల‌యానికి ఇచ్చిన భూమిని అమ్ముకున్నావ‌ని, నువ్వు పార్టీలో ఉండేది తెలియ‌దు.. బీఎస్పీలో క‌లిసేది తెలియ‌దంటూ పాయ‌ల్ శంక‌ర్‌పై ఎమ్మెల్యే జోగు రామ‌న్న కౌంటర్ ఇచ్చారు. సెకండ్ ఎపిసోడ్ ఉంటుంద‌ని ఎమ్మెల్యే ప్రకటనతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.ఇలా ప్రజాప్రతినిధులు, కీలక నేత‌లు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, విమర్శలు చేసుకుంటున్నారు. మీ చిట్టా మా వ‌ద్ద ఉంద‌ంటే.. మీ సంగతి మాకు తెలుసంటూ.. ఒకరిపై ఒకరు స‌వాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. పూర్తి ఆధారాలున్నాయని.. బహిరంగ చ‌ర్చకు సిద్ధమా.. నిరూపించకుంటే రాజీనామాలు, రాజకీయ సన్యాసం తీసుకుంటామని తొడ‌లు కొట్టుకుంటున్నారు. మాటల తూటాలు పేలుతున్నా.. ఆధారాలతో విపక్ష నేతలు బయటకు రావటం లేదు. తాము నిజాయితీ పరులమని, మేమేంటో ప్రజలకు తెలుసంటూ.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాటలు చెప్పి దాట వేస్తున్నారు. అవినీతి, అక్రమాల చిట్టాలు బయట పెడితేనే.. ప్రజలకు అసలు విషయం తెలిసేది. వచ్చే ఎన్నికల్లో ఎవరు అవినీతి పరులు, ఎవరు నిజాయితీ పరులో తేల్చుకుని ఓట్లు వేస్తామని జనం ఎదురు చూస్తున్నారు.

Related Posts