రాంచీ, మార్చి 5,
సీఎం కేసీఆర్ బాగా అహంకారి..అంటారు. గులాబీ బాస్‌కు తలపొగరు కూడా ఎక్కువే..అంటారు. ఎవరైనా, ఎంతటి వారైనా ఆయనముందు తలదించుకోవాల్సిందేనని.. కాదూకూడదని తల ఎగరేస్తే.. పాతాళానికి తొక్కేస్తారని అంటారు. ఇదంతా ఆయన దొరతనమని.. మిగతా నాయకులను బానిసలుగా చూస్తారనే విమర్శ అయితే ఉంది. అలాంటి కేసీఆర్‌లో ఇంకో షేడ్ కూడా ఉంది. ఆయనకు నచ్చితే.. తనకంటే గొప్పవారని తలిస్తే.. వంగివంగి దండాలు పెడతారు. వారి పాదాలను తాకుతారు. లేటెస్ట్‌గా, సీఎం కేసీఆర్.. ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సిబూ సోరెన్‌కు పాదాభివందనం చేయడం ఆసక్తికరంగా మారింది. సీఎం హేమంత్ సోరెన్‌ను కలిసేందుకు ఝార్ఖండ్ వెళ్లిన కేసీఆర్.. ఆయనతో పలు అంశాల్లో చర్చలు జరిపారు. అనంతరం, హేమంత్ తండ్రి.. సిబూ సోరెన్‌ను కలిసి.. ఆయన కాళ్లకు నమష్కరించి తన అభిమానాన్ని చాటుకున్నారు కేసీఆర్. ఆయన ఆరోగ్యం గురించి కుషల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. మామూలుగా అయితే, సీఎం కేసీఆర్ అంత ఈజీగా ఎవరి కాళ్లకూ దండం పెట్టరు. ఎదుటివారిపై అంతులేని అభిమానం ఉంటేకానీ.. వాళ్ల కాళ్ల మీద పడరు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడిగా, అప్పుడు ముఖ్యమంత్రిగా.. సిబూ సోరెన్ మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమానికి గట్టి మద్దతు దారుడిగా ఉన్నారు. పలుమార్లు ఢిల్లీ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాయిస్ బలంగా వినిపించారు. ఝార్ఖండ్‌లానే తెలంగాణ సైతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవటంలో సోరెన్ ఇచ్చిన మద్దతు కీలకం. అందుకే, సోరెన్ అంటే కేసీఆర్‌కు అంత అభిమానం. ఆ ఆరాధన భావమే.. ఇప్పుడు ఆయన్ను ఇలా కాళ్లకు నమష్కారం చేసేలా చేసిందంటున్నారు. అయితే, కేసీఆర్ ఇలా వంగివంగి దండాలు పెట్టే జాబితా చాలా చిన్నదే. ఎక్కువలో ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఉంటారంతే. వారిలో చినజీయర్ స్వామి అందరికంటే ముందుంటారు. దైవభక్తో, స్వామీజీపై అపార గౌరవవో.. కారణం ఏదైనా చినజీయర్‌ను కలిసినప్పుడల్లా పాదాభివందనం చేస్తుంటారు కేసీఆర్. కానీ, ఇటీవల ఆయనతోనూ వైరం పెట్టుకున్నారు గులాబీ బాస్. అదే కదా కేసీఆర్ నైజం అంటున్నారు. ఇక, స్వామీజీలు కాకుండా.. ప్రముఖుల్లో కేసీఆర్ తలొంచేది అతికొద్ది మందికే అంటారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్, ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను.. కేసీఆర్ అధికంగా అభిమానించేవారు.. గౌరవించేవారు. అనేకసార్లు అప్పటి గవర్నర్ నరసింహన్ కాళ్లకు నమష్కరించేవారు. ఆ తర్వాత అంతగా కేసీఆర్ వంగివంగి దండాలు పెట్టింది లేదు. కాకపోతే.. ఓసారి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుంటూ.. దాదా కాళ్లకు దండం పెట్టారు. ప్రధాని మోదీకీ ఓసారి వంగివంగి దండాలు పెట్టారు. ఇక, అప్పట్లో ఓ సాంస్కృతిక వేదికపై తనకు విద్య నేర్పిన గురువుకు, ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్‌కు.. ఇలా అతికొద్దిమందికి మాత్రమే కేసీఆర్ అలా కాళ్లకు నమష్కరించేది. ఇక, అంతే.. కేసీఆర్ నుంచి అంతటి వినయం ఇంకెవరి దగ్గరా కనిపించదు. ఎంతటివారైనా తనకాళ్లకే దండం పెట్టాలని కోరుకునే మనస్తత్వం ఆయనది.. అంటారు.