నల్గోండ
మంత్రి జగదీష్ రెడ్డి శనివారం హుజూర్నగర్ లో పర్యటించారు. రూ.7.20 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. తరవాత మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని ఎవరూ కలలో కూడా ఉహించని విధంగా.. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఒక్క నిమిషం కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేని స్థితిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. డబ్బులతో పార్టీ పదవులు కొనుక్కున్నవారు, ప్రజల్లో చెల్లుబాటు కాని నాయకులు సీఎం కేసీఆర్ను విమర్శిస్తే.. తగిన రీతిలో తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు.