విశాఖపట్నం, మార్చి 5
సహజసిద్ధ ఉత్పత్తులు కనువిందు చేశాయి. సేంద్రియ పంటలు ఆకట్టుకున్నాయి. వైజాగ్ పటం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో హోటల్ ఫాం బీచ్ లో ఏర్పాటు చేసిన నేచురల్ లివింగ్ ఎక్స్ పో అబ్బురపరిచింది. ఈ ఎక్స్ పోను శనివారం జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకట హరికృష్ణ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం వినియోగించే ఉత్పత్తులను సహజ, పర్యావరణ అనుకూలమైన వాటిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన వీసీసీఐ మహిళా వింగ్ ను అభినందించారు. మహిళలు పారిశ్రామికంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్షురాలు యడవల్లి హేమ మాట్లాడుతూ వీసీసీఐ మహిళా విభాగం ఏటా ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నట్టు చెప్పారు. ఈ ఎక్స్ పో వల్ల ఓ వైపు పారిశ్రామిక ప్రోత్సాహంతో పాటు ప్రజల్లో అవగాహన పెంపుదలకు దోహదపడుతుందని వివరించారు.
ఈ ఎగ్జిబిషన్‌లో వ్యక్తిగత వినియోగం, గృహావసరాలు, సేంద్రీయ పండ్లు, కూరగాయలు, సహజ ఉత్పత్తుల వినూత్న వినియోగం, ఆరోగ్య ఆహారాల మరెన్నో ఉత్పత్తుల శ్రేణిని చిత్రీకరించే 40 కంటే ఎక్కువ విభిన్న స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యక్షురాలు జీజా వల్సరాజ్ మాట్లాడుతూ రసాయనాలు, ప్లాస్టిక్‌ని ఉపయోగించడం వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన ఏర్పడుతుందన్నారు. ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడంతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ఈ ఎక్స్ పోను ఏర్పాటు చేశామని చెప్పారు.