వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర కృష్ణాజిల్లాలో పూర్తి చేసుకుని పశ్చిమ గోదావరిలోకి ప్రవేశించింది. ఆది నుంచి జగన్ ఈ పాదయాత్ర ద్వారా పేదలకు చేరువ కావడం, పార్టీని బలోపేతం చేసుకోవడం అన్న విషయాలు తెలిసిందే. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేర్చి.. అధికార పగ్గాలు చేపట్టడం. ఈ క్రమంలోనే ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర సాగుతున్న ప్రతి జిల్లాలోనూ పార్టీని బలో పేతం చేయడంపై దృష్టి పెట్టమని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్తవారిని పార్టీలోకి తీసుకు రావడం, ఇతర పార్టీలోని అసంతృ ప్తులను వైసీపీలో చేర్చుకోవడం వంటి వాటికి ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నాయకులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరిలో సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ భారీ ఎత్తున విజయం నమోదు చేసింది. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 14 చోట్ల టీడీపీ గెలుపొందగా.. మిగిలిన ఆ ఒక్క సీటును బీజేపీ- టీడీపీ బంధం నేపథ్యంలో తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాణిక్యాలరావు విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ బోణీ కూడా కొట్టలేక పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏలూరు మేయర్ సీటుతో పాటు జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇక 46 జడ్పీటీసీలకు వైసీపీ కేవలం మూడు మాత్రమే గెలిచింది. దీనిని బట్టి గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ గాలి ఎలా వీచిందో స్పష్టమవుతోంది.మరి అలాంటి కీలక జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తుం డడంతో సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. ఇక్కడ వైసీపీకి మద్దతు ఇచ్చేదెవరు? కొత్తగా పార్టీలోకి చేరేదెవరు? వంటి విషయాలపై నేతలు దృష్టి పెట్టారు. ఇక్కడ ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారిని బుజ్జగించి పార్టీలో చేర్చుకునేందుకు జగన్ పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో నేతలు పార్టీలోకి కొందరిని ఆహ్వానించినట్టు సమాచారం. వాస్తవానికి వైసీపీలో చేరేందుకు ఒకరిద్దరు నేతలు ఇప్పటికే రాయబారాల్లో నిమగ్నమైనట్టు చెబుతు న్నారు. కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైసీపీలో చేరేందుకు తహతహలాడుతున్నారు.జగన్ ఈ జిల్లాలో పోలవరం, చింతలపూడి మినహాయించి మిగిలిన 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర దాదాపు నాలుగు వారాలు సాగుతుందని అంటున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే డెల్టా, మెట్ట ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు కొందరితో మంతనాలు నడిపారు. వారిలో హరిరామజోగయ్య, కరాటం రాంబాబు వంటి నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు సీనియర్ నేతలు నేరుగా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వీరిలో కాంగ్రెస్ మాజీ నేతలు కూడా ఉండడం గమనార్హం. ప్రజల్లో పట్టున్న ఏ ఒక్క నాయకుడిని వదులుకోరాదని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీని ని బట్టి చూస్తే రాబోయే నెల రోజుల్లో ఊహించని విధంగా కొందరు వైసీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఒక అంచనా. కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకొనేందుకు కూడా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారనే ప్రచారం సాగుతోంది. కాపు నాయకులకు టికెట్లు ప్రకటించే ఛాన్స్‌ను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. ప్రధానంగా నరసాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీలను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి అత్తిలిలో గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథరాజును పార్టీలో చేర్చుకుని ఆచంట టిక్కెట్ ఇవ్వాలని చూస్తున్నారు. అదేవిధంగా టీడీపీ అసంతృప్తులకు కూడా టికెట్లు ఇస్తామనడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు. మరి జగన్ ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడో.. వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ వైసీపీ బోణీ కొట్టేలా చేస్తాడో చూడాలి.