కాకినాడ, మార్చి 7,
ఇసుక ఎప్పుడూ డిమాండ్ వున్న వస్తువు. కొంతమంది నేతలు ఇసుక నుంచి కూడా కరెన్సీ పిండేస్తారు. తూర్పు గోదావరిలో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సబ్ కాంట్రాక్ట్ లు పేరుతో దోచేస్తున్నారు. అనుమతి లేకుండా కొన్ని చోట్ల, నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్నిచోట్ల అడ్డంగా తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఛోటా నేతలు.. సబ్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినకాడికి తవ్వుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. బోట్స్‌మన్ సొసైటీలైనా, ఓపెన్ ర్యాంపులైనా… వెనక రాజకీయ నాయకుల హస్తం ఉంటోంది. లారీకి 500 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులు కొన్ని ర్యాంపుల్లో చక్రం తిప్పుతుంటే,~ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వెనుక ఉండి కథ నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అనుమతి లేకపోయినా… గోదావరి తీరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. రాజమండ్రి రూరల్ వెంకటనగరంలోని పట్టా భూముల్లో ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. గోదావరి లంక భూముల్లో ఎక్కడ చూసినా ఇసుకాసురులు పెట్టిన గోతులే కనిపిస్తాయి. ఇక సీతానగరం మండలం కాటవరం, వంగలపూడిలో అక్రమాలకు అంతే లేదు.అటు కోనసీమలోనూ.. ఇటు అఖండ గోదావరిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కోనసీమలో పలు ర్యాంపులకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అనుమతి ఇవ్వలేదు. అయినా అక్రమంగా తవ్వేస్తున్నారు. కోనసీమలోని కొన్ని మండలాల్లో అనుమతి లేకుండానే తవ్వుకుపోతున్నారు. లారీ నెంబర్లతో గోల్‌మాల్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇటు వెంకటనగరం నుంచి కాతేరు వరకూ ఉన్న ఏటిగట్టు ఇప్పటికే ధ్వంసం అయింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తూర్పుగోదారివరిలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై దర్యాప్తు జరిపితే చాలా పెద్ద తలకాయలే పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు స్థానికులు.