ఒంగోలు, మార్చి 7,
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. కానీ అది బయటపడే సమయం వచ్చింది. ఏ నిర్ణయం జగన్ తీసుకున్నా ఎమ్మెల్యేలను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. 151 ఎమ్మెల్యేలు తన వల్లనే, తన బొమ్మ వల్లనే గెలిచారని జగన్ భావించవచ్చు. కానీ అందులో ఇరవై నుంచి నలభై శాతం మంది ఎమ్మెల్యేలు తమ సొంత సత్తాతో గెలుపొందారనడంలో అతిశయోక్తి లేదు. జగన్ ఇమేజ్ వారి గెలుపునకు కొంత యాడ్ అయింది అంతే. కానీ గత మూడేళ్ల నుంచి తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, నియామకాల పట్ల వారిలో అసహనం కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు నాకు వ్యక్తిగతంగా పరిచయం. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు వారు రాజకీయంగా కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. యూత్ కాంగ్రెస్ నేతగా ఒకరు, కార్పొరేటర్ గా గెలవలేని మరొకరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి పేర్లు చెప్పటం అప్రస్తుతం. కానీ వారితో మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే వైసీపీ ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది హ్యాపీగా లేరు. వారు చెప్పేది ఒక్కటే. తాము గతంలోనూ ముఖ్యమంత్రులను చూశామని, నియోజకవర్గాల్లో నిర్ణయాలకు ఎమ్మెల్యే నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతనే ప్రకటించేవారు. కానీ జగన్ అలా కాదు. నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి జిల్లాల విభజన వరకూ ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే చేసేశారు. తమ అనుచరులకు, తమ విజయం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కులాలు, మతాలు పేరిట జగన్ తాను అనుకున్న వారికే పదవులు ఇవ్వడంతో వారిలో చాలా వరకూ అసంతృప్తి బయలుదేరింది.ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా తాను పార్టీ మారేందుకు కూడా సిద్దమని చెబుతున్నారు. జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజిస్తూ ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తమ రాజకీయ సౌధాన్ని జగన్ కూల్చేశారని వారు అభిప్రాయపడుతున్నారు. మార్కాపురం ను జిల్లా కేంద్రంగా చేయకపోవడం, కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం వంటి వాటిపై నేతలు గుర్రుగా ఉన్నారు. అయితే ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు బయటపడకపోవచ్చు. కానీ సమయం వస్తే తమ రాజకీయ జీవితాన్ని వదులుకునేందుకు వారు సిద్ధంగా లేరన్నది మాత్రం వారి మాటల్లో బయటపడింది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఖచ్చితంగా పార్టీని వీడటం ఖాయంగా కన్పిస్తుంది.