న్యూఢిల్లీ
రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఉక్రేయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో భారీగా బాంబుల వర్షం కురిపించింది. తాజాగా తీరప్రాంతమయిన మోకోలైవ్ పై ఫిరంగి దాడులు జరిగాయి. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై రష్యన్ సేనలు క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్పై పట్టు కోసం రష్యన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే వారికి ధీటుగా ఉక్రేనియన్ సైన్యం కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటికే రెండు అణు విద్యుత్ కేంద్రాలను రష్యా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు మరో అణువిద్యుత్ కేంద్రంపై దృష్టి సారించాయి. చెర్నోబిల్, జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఇప్పటికే పుతిన్ సేనల ఆధీనంలో ఉండగా మూడో అణువిద్యుత్ కేంద్రమైన యుజ్నౌక్రైన్స్క్ను స్వాధీనంచేసుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఈ అణువిద్యుత్ కేంద్రం ఉన్న మైకోలైవ్ పట్టణానికి ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఎయిర్ పోర్టులతోపాటు అన్ని ప్రాంతాల్లో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందని ఆరోపించారు. నల్ల సముద్రం తీరప్రాంతంలోని ఒడెస్సా నగరంపై మరోసారి బాంబుదాడులు చేసేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయని జెలెన్స్కీ అన్నారు. ఈశాన్యప్రాంతంలోని సుమి పట్టణంలో ఇంకా 700మంది భారతీయులు చిక్కుకున్నారు. వీరిలో విద్యార్ధులు కుడా వున్నారు. వీరిని తరలించడానికి పోల్టావా భారత రాయబార కేంద్రంలోని అధికారులు ప్రయత్నిస్తున్నారు.