YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూన్ 6న పంచాయితీ నోటిఫికేషన్

జూన్ 6న పంచాయితీ నోటిఫికేషన్

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు జూన్ 6 న నోటిఫికేషన్ జారీ చేసి, జూన్ 23 లోగా ప్రక్రియ పూర్తిచేయాలని సర్కారు యోచిస్తోన్నట్టు తెలుస్తోంది. నిర్దేశిత గడువు కంటే ముందే పంచాయితీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జులై చివరితో ముగియనుంది. దీంతో అంతకంటే ఐదు వారాల ముందే ఎన్నికలు నిర్వహించి, పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. శిక్షణ అనంతరం ఆగస్టు 1 న కొత్త పాలకవర్గాలు కొలువుదీరతాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో సోమవారం నాడు భేటీ అయిన పంచాయితీ రాజ్ శాఖ అధికారులు ఎన్నికల తేదీల ప్రతిపాదనలను వారి ముందుంచినట్టు సమాచారం. గతనెలలో తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం.. ఎన్నికల ప్రకటన వెలువడిన తేదీని కలుపుకొని 12వ రోజున పోలింగ్‌, ఓట్ల లెక్కింపుల ప్రక్రియను పూర్తిచేయాలి. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ లాంటివి ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనేది గరిష్ఠ సమయంతో సహా కొత్త చట్టంలో ప్రతిపాదించారు. కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి ప్రస్తుతం తెలంగాణలో 12,751 పంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. వీటిలో పాలకవర్గాల పదవీకాలం ఉన్న దాదాపు 15 పంచాయతీలను మినహాయిస్తే, మిగతా వాటకి ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలి. పంచాయితీలు పెద్దసంఖ్యలో ఉన్నందున పోలింగ్‌ను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జూన్‌ 23 నాటికి ముగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పంచాయతీలు, వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాలను మే 17 న వెలువడతాయి. అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు అనంతరం వీటిలో జనరల్‌ కేటగిరి స్థానాల్లోను తిరిగి 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. 

Related Posts