హైదరాబాద్
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం చేశామని చెప్పారు. అర్హులయిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద 71 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను మంత్రి అందించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. గర్భిణిలను ప్రసవం కోసం దవాఖానకు తీసుకెళ్లేందుకు అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన మహిళలకు కేసీఆర్ కిట్ కింద అవసరమైన సామాగ్రి, ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల మందికిపైగా కేసీఆర్ కిట్లను అందించామని తెలిపారు.