ఏలూరు, మార్చి 8,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు వెనక్కు తగ్గారా? రాజీనామా నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసుకున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. ఆయన ఏప్రిల్ నెలలో రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నిజానికి రఘురామ కృష్ణరాజు ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. పలు మీడియా ఛానళ్లలో, ఆయన నిత్యం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5లోపు తనపై అనర్హత వేటు వేయించాలని ఆయన సవాల్ కూడా విసిరారు. రఘురామ కృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకున్నారు. అందుకోసం బీజేపీ పెద్దలను ఢిల్లీలో పదే పదే కలిశారు. అయితే ఆయన ఎంట్రీకి బీజేపీ హైకమాండ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ముఖ్యంగా థర్డ్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి తర్వాత బీజేపీ హైకమాండ్ కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. కేవలం రఘురామ కృష్ణరాజు ఒక్కడి కోసం వైసీపీని దూరం చేసుకోవడం ఎందుకని వారు ఆలోచనలో పడ్డారు. అందుకే రఘురామ కృష్ణరాజు పార్టీలో చేరికకు ఇంకా సుముఖత వ్యక్తం చేయడం లేదంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తొలి విడత ముగిసిన వెంటనే ఆయన రాజీనామా చేయాల్సి ఉంది. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 11 వరకూ జరిగాయి. అయితే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన తన రాజీనామాను మరికొంత కాలం వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. జనసేనలోనైనా.... పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండో విడత ఈ నెల 14వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఆ తర్వాత రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే అప్పటికీ బీజేపీ తన చేరికకు అంగీకరించకపోతే జనసేనలో చేరయినా పోటీ చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. జనసేన, బీజేపీ పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలోనైనా చేరి ఉప ఎన్నికల్లో నరసాపురం నుంచి గెలవాలన్న పట్టుదలతో రఘురామ కృష్ణరాజు ఉన్నారు. మరి రాజీనామా ఖాయమట. ఏ పార్టీ అన్నదే ఇప్పుడు తేలని ప్రశ్న.