విజయవాడ, మార్చి 8,
చేసే పనులన్నీ అలానే ఉన్నాయి.. ఆ మీటింగ్‌లన్నీ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి.. అదే విషయం మీడియా కోడైకూస్తే మాత్రం.. కాదు కాదు.. నాకు రాజకీయాలతో సంబంధం లేదు.. ఏపీలో కొత్త పార్టీ పెట్టట్లేదంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు బ్రదర్ అనిల్‌కుమార్. అదే ఆయనే.. షర్మిల ఆయన. మరి, అలాంటి ఉద్దేశ్యమే లేనప్పుడు.. మదిలో ఎలాంటి దురుద్దేశ్యం అస్సలే లేనప్పుడు.. మరి మీమానాన మీరొచ్చి.. ఆ సువార్త సభలేవో పెట్టుకొని.. చర్చిల్లో ప్రార్థనలు చేసుకొని వెళ్లిపోవచ్చుగా! ఎవరూ ఏమీ అనుమానించే వాళ్లు కాదుగా! ప్రజలంతా తమ మానన తాము మాడిపోయిన మసాలా దోస తింటుంటే.. ఈ బ్రదర్ గారొచ్చి.. బిగ్ బ్రదర్‌లాంటి ఉండవల్లిని కలిసే. అలా కలిస్తే మీడియా ఊరుకుంటుందా? కనీసం అక్కడితోనైనా ఆగారా? లేదే. లేటెస్ట్‌గా విజయవాడ వచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాల నేతలతో గంటల తరబడి చర్చలు జరిపే. ఎప్పుడూ లేనిది బ్రదర్ అనిల్.. ఏపీలో ఇలా యాక్టివ్ మీటింగ్స్ పెడుతుంటూ.. అందులోనూ పొలిటికల్ టచ్ ఉన్న వారితోనే భేటీలు జరుపుతుంటే.. ఇంత స్పష్టంగా నిప్పు రాజకుంటుంటే.. పొగ రాకుండా ఎలా ఉంటుంది? కొత్త పార్టీ చర్చ జరగకుండా ఎలా ఉంటుంది? ఇటీవల బ్రదర్ అనిల్ రాజమండ్రి ఎందుకొచ్చారు? ఉండవల్లితో క్రీస్తు గురించి చర్చించడానికొచ్చారా ఏంది? వాళ్లిద్దరి మధ్య మత ప్రచార మంతనాలు జరిగే అవకాశమే లేదుగా! మరెందుకు ఉండవల్లిని అనిల్ కలిసినట్టు? ఏపీ రాజకీయాల్లో మేథావిగా ముద్రపడిన ఉండవల్లి.. ఇటీవల జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పైగా ఆయన వైఎస్సార్ వీరవిధేయుడు. అలాంటి ఉండవల్లిని అనిల్ కలవడం వెనుక పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటుంది?ఇక, బెజవాడలో అలా కుల-మతాల వారీగా సమావేశాలు పెట్టడం రాజకీయం కాదా? అందులోనూ, జగన్‌కు, వైసిపికి వ్యతిరేకంగా ఉంటున్న వర్గాలతో భేటీ జరిపి.. ఆ మీటింగ్‌లో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడి.. మాట్లాడించి.. జగన్ తమకు అన్యాయం చేశాడని, తమను పట్టించుకోవడం లేదని చెప్పించి.. తీరా ఆ వివరాలన్నీ బయటకు రావడంతో.. అబ్బే.. అది జస్ట్ ఫార్మల్ మీటింగ్.. రాజకీయం లేదు.. కొత్త పార్టీ లేదంటూ.. ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తే.. జనాలేమైనా వెర్రిపప్పలు అనుకుంటున్నారా.. మిస్టర్ అనిల్?.. అంటున్నారు. ఏదో జరుగుతోంది. అది జగన్‌కు యాంటీగానే అని పక్కాగా తెలుస్తోంది. మరి, ఎందుకీ డొంక తిరుగుడు? అవును, మేం ఏపీలో కొత్త పార్టీ పెట్టబోతున్నాం.. జగన్‌ను దెబ్బ తీయబోతున్నాం.. అని చెప్పేయొచ్చుగా? ధైర్యం లేదా? బావ అంటే భయమా? అని అంటున్నారు జనాలు.షర్మిల.. జగనన్నపై ఎప్పటినుంచో రగిలిపోతున్నారు. తనను కరివేపాకులా.. వదిలేసిన అన్నపై కసి తీర్చుకోవాలని చూస్తున్నారు. ఆస్తులు పంచకుండా.. రాజకీయాల్లో వాటా ఇవ్వకుండా.. ఇంటికే పరిమితం చేద్దామని చూసిన అన్నపై ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారు. ముందు అన్నపై అలిగొచ్చి.. తెలంగాణలో తన సొంత రాజకీయం చేయాలనుకున్నారు. ఏపీని వదిలేసినా.. జగనన్న తనను అవమానించడం.. చీప్‌గా చూడటం మానకపోవడంతో.. తెలంగాణలో కాదు.. అన్నకు బుద్ధి చెప్పాలంటే ఏపీలో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు చెల్లి షర్మిల అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో తాను పార్టీ పెట్టేశాను కాబట్టి.. ఏపీలో అనిల్‌తో కొత్త పార్టీ ప్రారంభించాలా? లేక, తానే స్వయంగా అన్నపై పోరాడాలా? తాను మరోసారి రోడ్డెక్కితే ఫలితం ఎలా ఉంటుంది? తనకు ఏ మేరకు లాభం? జగనన్నకు ఎంత నష్టం? ఇలా.. పలురకాలుగా రాజకీయ మథనం చేస్తున్నారు షర్మిల. అందులో భాగమే.. షర్మిల వదిలిన బాణమే.. బ్రదర్ అనిల్‌కుమార్ అంటున్నారు. ఉండవల్లితో భేటీ కానీ.. వివిధ సంఘాలతో చర్చలు కానీ.. జగనన్నపై షర్మిల-అనిల్‌లు చేయబోయే రాజకీయ యుద్ధానికి ముందస్తు కసరత్తు అని విశ్లేషిస్తున్నారు. కాదు.. అలాంటిదేమీ లేదు.. అనే రొటిన్ డైలాగ్స్‌ను ఎవరూ నమ్మరు బ్రదర్! జనాలు అంత అమాయకులేమీ కాదు అనిల్!!