YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తగ్గుతున్న ఎరువుల వినియోగం

తగ్గుతున్న ఎరువుల వినియోగం

విజయవాడ, మార్చి 8,
రాష్ట్రంలో రైతుల ఎరువుల వినియోగం తగ్గుతోంది. ఖరీఫ్‌లో ఈ ధోరణి కనిపించగా రబీలో ఇంకా ఎక్కువైంది. ఖరీఫ్‌, రబీ కలుపుకొని మునుపటి ఏడాది కంటే ఈ మారు దాదాపు 8.36 లక్షల టన్నుల సేల్స్‌ తగ్గాయి. ఖరీఫ్‌లో 2.78 లక్షల టన్నులు తగ్గగా రబీలో ఇప్పటి వరకు 5.58 లక్షల టన్నుల వినియోగం తగ్గింది. కాంప్లెక్స్‌, డిఎపి ఎరువుల ధరలు విపరీతంగా పెరగడం, సాగు విస్తీర్ణం తగ్గడం, అదునుకు సరఫరా లేకపోవడం, కరువు, తుపాన్ల వంటి విపత్తులు... ఎరువుల వాడకం తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. ధరల పెరుగుదల వల్ల ఎరువుల వినియోగం తగ్గడం సాగులో విపరీత పరిణామాలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎరువుల వాడకంలో సమతౌల్యం (బ్యాలెన్స్‌) దెబ్బతినడం వల్ల భూసారంలో విపరీత మార్పులు సంభవిస్తాయని, ఈ పరిణామం పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుం దని ఆందోళన చెందుతున్నారు. శాస్త్రీయంగా చేసిన సిఫారసులకనుగుణంగా నత్రజని, ఫాస్పేట్‌, పొటాష్‌ సమపాళ్లలో అవసరానికనుగుణంగా పంటలకు అందకపోతే దిగుబడులు గణనీయంగా పడిపోతాయని చెబుతున్నారు. ఎరువుల వాడకం తగ్గుదల సాగు సంక్షోభానికి సంకేతంగా అభివర్ణిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రకృతి, సేంద్రీయ సాగు వల్ల రసాయన ఎరువుల వాడకం తగ్గిందనే వాదనల్లో పస లేదంటున్నారు.2021-ఖరీఫ్‌లో ఎరువుల వాడకం తగ్గుదల మొదలైంది. అంతకుముందు ఖరీఫ్‌ కంటే యూరియా 1.12 లక్షల టన్నులు, ఎంఒపి 22 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 83 వేల టన్నులు, ఇతర ఎరువులు 32 వేల టన్నులు తగ్గాయి. మొన్న ఖరీఫ్‌లో డిఎపి దొరక్క రైతులు ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. అలాంటి డిఎపి సేల్స్‌ సైతం 33 వేల టన్నులు తగ్గాయి. ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు తగ్గాయని సర్కారు నొక్కివక్కా ణిస్తోంది. ఒక్క ఎస్‌ఎస్‌పి మాత్రం స్వల్పంగా ఐడు వేల టన్నుల అమ్మకాలు పెరిగాయి. ముందటి ఖరీఫ్‌ కంటే ఈ తడవ 2.45 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది.రబీ దాదాపు ముగింపుదశకు రాగా మార్చి 3 నాటికి చూసుకుంటే 2020-21 రబీ కంటే 2021-22 రబీలో ఏకంగా 5.58 లక్షల టన్నుల ఎరువుల సేల్స్‌ తగ్గాయి. అత్యధికంగా కాంప్లెక్స్‌ 2.06 లక్షల టన్నులు, యూరియా 1.38 లక్షల టన్నులు, ఎంఒపి 1.04 లక్షల టన్నులు, డిఎపి 42 వేల టన్నులు, ఇతర ఎరువుల సేల్స్‌ 74 వేల టన్నులు తగ్గాయి. ఒక్క ఎస్‌ఎస్‌పి మాత్రం 9 వేల టన్నులు పెరిగింది. నిన్న మొన్నటి వరకు కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత నెలకొంది. అయినప్పటికీ యూరియా సేల్స్‌ గతం కంటే తగ్గాయి. గత ఖరీఫ్‌ కంటే ఈ ఏట 3.82 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఆ రకంగా చూసినా ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గినట్లేనని అంచనా వేస్తున్నారు.

Related Posts