YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

జస్టిస్‌ ఫర్‌ పిఆర్‌సి' నినాదంతో ఆందోళన

జస్టిస్‌ ఫర్‌ పిఆర్‌సి' నినాదంతో ఆందోళన

విజయవాడ, మార్చి 8,
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 27 శాతం ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎ, సిసిఎతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి అయ్యే అదనపు వ్యయం రూ. 3,181 కోట్లని అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ స్పష్టం చేసిన నేపథ్యంలోనైనా సర్కారువారు అసలు నిజాలు వెల్లడిస్తారా? జెఎసి నాయకులతో చర్చల సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికార్లు, సర్కారుపై రూ.11,577 కోట్లు అదనపు వ్యయమని చెప్పిన మాటలపై పెద్దలు ఇప్పుడేమంటారు? ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పిఆర్‌సిని రివైజ్‌ చేస్తారా? సర్కారు తన తప్పును సరిదిద్దుకుంటుందా? ఉన్నట్టుండి శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టారు? ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వాదన సబబైనదని పిఆర్‌సి నివేదిక నిర్ధారించిన నేపథ్యంలో వారి భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇటువంటి అనేక ప్రశ్నలు, సందేహాలు అనేకం తలెత్తుతున్నాయి.అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను గుట్టుచప్పుడు కాకుండా శనివారంనాడు రాత్రి తొమ్మిది గంటల తరువాత సిఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి కారణం లేదా కారణాలేమిటని పలువురు చర్చించుకుంటున్నారు. పిఆర్‌సి జిఓలు ఇచ్చాక ఆ నివేదికను బయటపెడతామని చర్చల సందర్భంలోనే సర్కారు చెప్పింది కనుక అలా చేసిందని ఒక వివరణ. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి అదేదో బహిరంగంగానే చేస్తే సరిపోతుంది కదా అని ఇలా ప్రకటించిందని కొందరంటారు. ఇప్పటికే పిఆర్‌సి విషయంలో అసంతృప్తిగా ఉన్న ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులూ ఆందోళనను వివిధ రూపాల్లో కొనసాగిస్తున్నారు. దశలవారీ ఉద్యమం తరువాత మార్చి 4న విజయవాడ ధర్నా చౌక్‌లో ఎంఎల్‌సిలు దీక్ష చేశారు. అది మరింత ఉధృతం కాకముందే సర్కారు స్పందించింది అనిపించడానికి ఆ నివేదికను బయటపెట్టారని ఇంకొందరి అంచనా. అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు సోమవారం నుండి జరగనున్న నేపథ్యంలో ముఖ్యంగా కౌన్సిల్‌లో పిడిఎఫ్‌, ఇతర సభ్యులూ నిలేస్తారు కనుక ముందుగానే ప్రభుత్వం నివేదికను వెల్లడించిందని ఇంకొందరంటున్నారు. ఏది ఏమైనా చాలా కాలంగా ఎదురు చూస్తున్న పిఆర్‌సి నివేదిక ఇప్పటికి అందుబాటులోకి రావడం మంచిదే !అశుతోష్‌ మిశ్రా నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పదే పదే అడిగాయి కనుక దాన్ని వెబ్‌సైట్‌లో పెట్టాం. జీత భత్యాల విషయంలో ఇప్పటికే జిఓలు ఇచ్చేశాం. అని సర్కారు చేతులు దులుపుకోవచ్చు. కాని, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ మాత్రమేగాక ప్రస్తుతం ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీసు కండిషన్లు, వివిధ స్థాయిల్లో కొత్త రిక్రూట్‌మెంట్‌ ఎలా జరగాలి- ముఖ్యంగా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ వంటి అంశాల్లో కమిషన్‌ కొన్ని సిఫార్సులు చేసింది. ఆర్థిక విషయాలపై సర్కారు జిఓలిచ్చింది కాని మిగతా వాటిపై తన వైఖరేమిటో వెల్లడించలేదు. అలాగే వివిధ గ్రేడ్ల సర్దుబాట్లు అంటే కొన్ని పోస్టులకు తగ్గించడం, ఇంకొన్ని పోస్టులను పై గ్రేడ్‌కు సిఫార్సు చేయడం వంటివీ ఉన్నాయి. సిఎస్‌ అధ్వర్యాన ఏర్పడిన అధికారుల కమిటీ ప్రధానంగా ఆర్థిక అంశాలపైనే దృష్టి పెట్టిందనీ ఇటువంటి విషయాల్లో తేడాలున్నాయని నిపుణులు అంటున్నారు. పిఆర్‌సి సిఫార్సుల అమలులో వచ్చిన ఇబ్బందులను సవరించడానికి ఎనామలీస్‌ కమిటీని నియమించి, సంబంధిత తరగతి ఉద్యోగ ఉపాధ్యాయ ప్రతినిధులతో చర్చల అనంతరం వాటిని పరిష్కరిస్తూ కొత్త జిఓలివ్వడం ఎప్పటినుండో వస్తున్న ఆనవాయితీ. అయితే, ఇప్పుడు నియమించనున్న ఎనామలీస్‌ కమిటీ ఇప్పటికే జారీ చేసిన జిఓల అమలుకే పరిమితమవుతుందా లేక పిఆర్‌సి సిఫార్సులలో ముఖ్యంగా విధాన సంబంధ అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది వేచి చూడాలని ఇంకొందరు అంటున్నారు. ఏమైనా 27 శాతం ఫిట్‌మెంట్‌తో పిఆర్‌సిని రివైజ్‌ చేయడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు పున:ప్రారంభించి తన పొరపాట్లను సరిదిద్దుకోవడం సర్కారు ముందున్న ఉత్తమ మార్గంమధ్యంతర భృతిగా చెల్లించిన 27 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని తొలినుండీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ కూడా అంతే సిఫార్సు చేయడం ద్వారా ఆ డిమాండ్‌ సహేతుకమైనదని నిర్ధారణ అయ్యింది. అలాగే హెచ్‌ఆర్‌ఎ శ్లాబులు, శాతాలపై కమిషన్‌ సిఫార్సులు జెఎసి డిమాండ్లకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఉద్యమం ధర్మ సమ్మతమైనదనీ, వారి డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కాదని తేలిపోయింది. ఇప్పటికే 'జస్టిస్‌ ఫర్‌ పిఆర్‌సి' నినాదంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు సాగిస్తున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి సానుకూల నేపథ్యం ఏర్పడింది. పిఆర్‌సి రివైజ్‌ చేయాలన్న ఉద్యమానికి అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సులు ఉత్ప్రేరకాలు. పోరుబాటే విజయ సాధన మార్గం !

Related Posts