YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫిబ్రవరిలో ఖాళీగా డ్యామ్

ఫిబ్రవరిలో  ఖాళీగా డ్యామ్

కాకినాడ, మార్చి 8,
ప్రాజెక్టుల్లోకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చినా రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరందించలేని స్థితిలో ప్రాజెక్టుల నిర్వహిస్తున్న తీరు పట్ల రైతులు మండి పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ ఆయకట్టు వున్న కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టుల్లోకి ఈ ఏడాది పెద్దఎత్తున నీరు వచ్చింది. శ్రీశైలం డ్యామ్‌లోకి ఏకంగా 1088 టీఎంసీల నీరు వచ్చింది. అయినా ఫిబ్రవరి నెలలోనే డ్యామ్‌ ఖాళీ అయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి, కెసి కెనాల్‌, తెలుగుగంగ కాల్వల కింద వున్న ఆయకట్టుకు నీరు అందక పైర్లన్నీ వాడిపోతున్నాయి.ప్రస్తుతం పత్తి, మిరప, వరి,మినుము, జొన్న తదితర పంటలకు తక్షణ నీటి ఆవశ్యకత వుంది. హంద్రీనీవా సుజల స్రవంతి కింద అనంతపురం, కర్నూలు జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు తడుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి వుంది. కెసి కెనాల్‌కు తుంగభధ్ర డ్యామ్‌ నుండి సుంకేసుల ద్వారా నీరు వస్తున్నా.. చివరి పొలాలకు అందడం లేదు. తెలుగుగంగకు కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. ముందు చూపు లేకుండా వెలుగోడు రిజర్వాయర్‌ను ఖాళీ చేసినందునే ఈ దుస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్‌, డిశంబర్‌లో కూడా శ్రీశైలంలోకి వరద నీరు రావడంతో ఈ ఏడాది సాగునీటి కష్టాలకు తెరపడుతుందని చాలా ప్రాంతాల్లో రబీ కింద ఆరుతడి పంటలను సాగుచేశారు. రెండేళ్ల క్రితం వరకు మార్చి చివరి వారం దాకా హంద్రీనీవా కాలువలకు నీరు అందించిన నేపథ్యముంది. దీంతో ఈ ఏడాది వరద నీరు ఎక్కువగా వచ్చినందున రబీసాగుకు ఎలాంటి డోకా వుండదని రైతులు పైర్లు విస్తారంగా సాగు చేశారు. కెసి కెనాల్‌ కింద కొన్ని చోట్ల వరి నాట్లూ వేశారు. అయితే ముందు చూపు లేకుండా తెలగాణా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలంలో విధ్యుత్‌ ఉత్పత్తి చేయడంతో దిగువకు వృధాగా నీరు తరలిపోయిన సంగతి తెలిసిందే. శ్రీశైలం డెడ్‌ స్టోరేజ్‌ 834 అడుగులతో 54 టిఎంసిలు కాగా ఇపుడు ప్రస్తుతం శ్రీశైలంలో 803 అడుగులతో కేవలం 30 టిఎంసిల నీరు మాత్రమే వుంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలంలో దాదాపు వంద టిఎంసిలు వుంటే ఈ ఏడాది బాధ్యతా రాహిత్యంగా మొత్తం శ్రీశైలం డ్యామ్‌ను ఖాళీ చేయడంతో శ్రీశైలం నీటితో వున్న ఆయకట్లు మొత్తం సంక్షోభంలోకి పోయింది. రాయలసీమ జిల్లాలకు సాగునీరే కాదు తాగునీటిని అందించే కీలకమైన శ్రీశైలం డ్యామ్‌ ఖాళీ అవడంతో రబీ కింద వేసిన పంటలతో పాటు రానున్న వేసవి తాగునీటి అవసరాలకు తీవ్రమైన ముప్పు కానుంది ముందు చూపు లేకుండా శ్రీశైలం డ్యామ్‌ను ఖాళీ చేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయ్యింది. ఇప్పటికే హంద్రీనీవా కింద వున్న పంటలను పరిరక్షించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత బాగా వున్నందున కర్నాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి హంద్రీనీవాకు, కెసి కెనాల్‌కు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

Related Posts