YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

తెరమీదకు నో ఫ్లై జోన్

తెరమీదకు నో ఫ్లై జోన్

న్యూఢిల్లీ, మార్చి 8,
ప్రస్తుతం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘నో ఫ్లై జోన్‌’. రష్యా దాడులు ఉధృతం కావటంతో తమ గగన తలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఆయన నాటో కూటమికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే అమెరికా, పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు.నోఫ్లై జోన్‌ ప్రకటన అంటే రష్యా విమానాలను కూల్చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వటమే. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్టే. అప్పుడు పరిస్థితి ఇప్పటికన్నా భీకరంగా మారుతుంది. మిగతా ఐరోపా దేశాలకు చుట్టుకుంటుంది. చివరకు అణ్వస్త్ర యుద్ధానికి దారితీయవచ్చు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు న్యూక్లియర్ దేశాలు ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధానికి తలపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘నో-ఫ్లై జోన్‌గా ప్రకటిస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టే. నాటో భయం కూడా ఇదే.ఉక్రెయిన్‌ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా పశ్చిమ దేశాలను కోరుతున్న జెలెన్‌స్కీ ఆదివారం మరోసారి తన గోడు మొరపెట్టుకున్నాడు. ఈ సారి చాలా ఘాటు పదాలు వాడారాయన. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెనియన్లను చంపిన పాపం పశ్చిమ దేశాలదే అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయినా పశ్చిమ దేశాలు అందుకు ఒప్పుకోవటం లేదు.నో ఫ్లై జోన్‌ అంటే ఒక నిర్ధిష్టమైన గగనతలంపై కొన్ని రకాల విమానాలు ఎగరకుండ నిషేధం విధించడం. యుద్ధ సంక్షోభ సమయాల్లో, ఐక్యరాజ్య సమితి అనుమతించిన సైనిక చర్యలు జరిగినపుడు నో ఫ్లై జోన్ ప్రకటిస్తారు. సాధారణంగా అత్యంత సున్నిత ప్రాంతాలను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంటారు. మిలిటరీ భాషలో చెప్పాలంటే నిషేధం విధించిన ఎయిర్‌ స్పేస్‌లోకి విమానాలు ప్రవేశించకుండా అడ్డుకోవడం. ఆ ప్రాంతంపై ఇతర దేశాల విమానాలతో దాడులు చేయకుండా, అలాగే అవి నిఘా పెట్టకుండా చూసేందుకు ఈ చర్య తీసుకుంటారు. ఒకసారి నో ఫ్లై జోన్ గా డిక్లేర్‌ చేసిన తరువాత ఆ గగనతలంలోకి విమానాలు ఎంటర్‌ కాకుండా సైన్యం నిరంతరం గస్తీ కాస్తుంది.
నిషేధిత గగనతలంలోకి ప్రవేశించే విమానాలను సైన్యం కూల్చేయవచ్చు. ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ విధించడం అంటే ఒకరకంగా రష్యాతో నాటో దళాలు నేరుగా తలపడటమే. అంటే అక్కడ రష్యా విమానాలను నాటో ఫోర్స్‌ గుర్తించినప్పుడు, అవసరమైతే వాటిని కూల్చేయాల్సి ఉంటుంది. అప్పుడు ముప్పు ఊహించనంత వేగంగా పెరుగుతుంది. అందుకే ఇందులో జోక్యం చేసుకోవడం నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టొల్టెన్‌బర్గ్ కు అసలే ఇష్టం లేదు. అమెరికా అనుంగ మిత్ర దేశం బ్రిటన్ కూడా ఇదే అంటోంది. ఎందుకంటే రష్యా జెట్ విమానాలతో పోరాటం చేయడమంటే యుద్ధాన్ని యూరప్ అంతటికి వ్యాప్తి చేయడమేననని బ్రిటన్‌ రక్షణ శాఖ నిపుణులు అంటున్నారు. అమెరికా చట్ట సభల మెజార్టీ ప్రతినిధులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.మరోవైపు జెలెన్‌ స్కీ నో ఫ్లై జోన్‌ విజ్ఞప్తులపై పుతిన్‌ సీరియస్‌గా స్పందించారు. ఆయన కోరికను మన్నించి ఉక్రెయిన్‌ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌గా విధిస్తే యుద్ధానికి దిగినట్టేనని హెచ్చరించారు. ‘నో ఫ్లై జోన్‌’పై ముందుకు వెళ్తే.. నాటో దేశాలతో పాటు మొత్తం ప్రపంచ దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు తమపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగానే రష్యా పరిగిణిస్తోంది. ‘నో-ఫ్లై జోన్‌’ను విధించే దేశాలు తమతో యుద్ధానికి సిద్ధపడాలని పుతిన్‌ ఇప్పటికే స్పష్టం చేశారురష్యా ప్రపంచంలో అతి పెద్ద అణ్వస్త్ర సంపన్న దేశం. రష్యా స్థానంలో మరే దేశం ఉన్నా ఎప్పుడో నో ఫ్లైజోన్‌ ప్రకటించేవారు. అందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1991లో జరిగిన మొదటి గల్ఫ్ యుద్ధం తర్వాత అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాక్‌లో రెండు నో ఫ్లై జోన్‌లను ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి మద్దతు లేకుండానే ఈ చర్య చేపట్టారు.1992లో బాల్కాన్స్ సంక్షోభం సమయంలో బోస్నియా గగనతలంలోకి అనధికార సైనిక విమానాలు ప్రవేశించడాన్ని ఐక్యరాజ్య సమితి నిషేధించింది. 2011లో లిబియాలో సైనిక జోక్యంలో భాగంగా నో ఫ్లై జోన్‌కు సమితి భద్రతా మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కానీ రష్యా విషయంలో నాటో కానీ, ఐక్యరాజ్య సమితి కానీ నో ఫ్లై జోన్‌ అంత ఈజీ కాదని అర్థమవుతోంది. అయితే పశ్చిమ దేశాలు ప్రత్యక్షంగా ఉక్రెయిన్‌కు సైనికులను పంపటం లేదు. కానీ ఆయుధ సామాగ్రిని పంపుతున్నాయి.రష్యాతో ఉద్రిక్తతలు పెరిగితే అది అణు యుద్ధానికి దారి తీయవచ్చనే భయాలు ఇప్పటికీ పశ్చిమ దేశాలను వెంటాడుతున్నాయి. రష్యా అణు బలగాలు సిద్ధంగా ఉండాలని పుతిన్ ప్రకటించిన తర్వాత ఈ భయాలు మరింత పెరిగాయి. నిజానికి అణ్వాయుధాలను వాడే ఉద్దేశం పుతిన్‌కు లేదు. ఆయన ఎందుకు ఈ దాడులు చేస్తున్నారో ఇప్పటికే అనేక మార్లు స్పష్టంగా చెప్పారు. ఒకటి రెండు రోజులలో యుద్దం కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని విదేశాంగ, రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Related Posts