YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్‌

హైదరాబాద్, మార్చి 8,
రోడ్ల నిర్మాణం, వెడల్పు, పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన కేంద్ర రోడ్ల మౌలిక సదుపాయాలు నిధి(సీఆర్‌ఐఎఫ్‌) పనుల మంజూరు, నిధులు విడుదల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తున్నది. తెలంగాణకు గతం కంటే అధిక మొత్తంలో కేంద్రం నుంచి పనులను మంజూరు చేయించామని ఒకవైపు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఉన్న కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు చెబుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భిన్నమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాము రూ. 620 కోట్ల మేర పనులకు ప్రతిపాదనలు పంపించామని రాష్ట్రం అంటుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.878.55 కోట్ల పనులకు మంజూరు చేశామని చెబుతున్నది. అయితే, పనుల మంజూరు ఇచ్చినంత వేగంగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నుంచి నిధులు విడుదల చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు అమలులో తాము శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నప్పటికీ, తమకు పరిమిత స్థాయిలోనే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతున్నాయని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1990లో కేంద్ర ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల కల్పనకు వీలుగా పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ యాక్టు-2000ను అప్పటి వాజ్‌పేరు ప్రభుత్వం తీసుకువచ్చింది. అందులో సీఆర్‌ఎఫ్‌ పథకాన్ని ఏర్పాటుచేసి, రాష్ట్రాలతో కలిసి రోడ్ల నిర్మాణం, వెడెల్పు, పునరుద్ధరణ కోసం నిబంధనలు రూపొందించింది. తొలుత ఆయా రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు సంబంధించిన పనులు మంజూరు చేయడం, వాటిని రాష్ట్రాలు పూర్తిచేసి తర్వాత నిధులను రీయింబర్స్‌ చేయడం ఆనవాయితి. అయితే, 2018లో నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సీఆర్‌ఎఫ్‌ పథకాన్ని సీఆర్‌ఐఎఫ్‌గా మారుస్తూ చట్ట సవరణ చేసింది. పాత పద్ధతినే అనుసరిస్తూ కొత్త అంశాలను జోడించింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయాల్సి ఉంటుంది. ప్రతియేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు సంబంధించి ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుంది. అయితే, ప్రస్తుతం పనుల మంజూరు కోసం తెలంగాణ సర్కారు పంపిన దానికంటే మరొక రూ.258.55 కోట్ల మేర అధికంగా పనులు మంజూరు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పథకం కింద ఆయా రోడ్లకు సంబంధించి నిర్మాణం, పునరుద్ధరణ చేపట్టినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆలస్యంగా నిధులు విడుదల చేస్తున్నదని పేరు రాయడానికి ఇష్టపడని ఒక ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రతి సంవత్సరం ఈ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్టు సమాచారం. పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రీయింబర్స్‌ చేయించాల్సిన నిధుల పరిమితిని పెంచకుండా ,పనులు పెంచితే తమపై ఆర్థిక భారం పడుతుందని ఆర్‌ అండ్‌ బీ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పులు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం సైతం చెబుతున్నది. అంతేగాక పనుల ప్రతిపాదనలకు కూడా కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆమోద ముద్ర వేయకుండా, తీవ్ర ఆలస్యం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. సీఆర్‌ఐఎఫ్‌ పథక నిబంధనల మేరకు పనుల నిర్మాణంతోపాటు పునరుద్ధరణ కోసం ఇచ్చే నిధులను రూ. 260 కోట్లు మాత్రమే ఇస్తున్నదనీ, గత ఏడు సంవత్సరాలుగా వీటినే కొనసాగిస్తున్నదని చెబుతున్నారు. సీఆర్‌ఐఎఫ్‌ కింద తాము నిర్మించిన, పునరుద్ధరించిన పనులకు సంబంధించి నిధులు పరిమతిని ప్రతియేటా రూ.600 కోట్లకు పైగా పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాల ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లను నిర్మించిన సంవత్సరం తర్వాతే ఈ నిధులు విడుదల చేస్తున్నారనీ, అందుచేత మొత్తం ఒకేసారి ఇస్తే తాము కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించగలుగుతామని చెబుతున్నారు. లేకపోతే కాంట్రాక్టర్లు పని పూర్తయ్యాక బిల్లుల విడదల కోసం తమను సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీఆర్‌ఐఎఫ్‌ నిధులను ఒకేసారి కాకుండా, రెండు, మూడేండ్లపాటు ఆలస్యం చేస్తున్నదనే విమర్శలు ఆర్‌అండ్‌బీతోపాటు కాంట్రాక్టర్ల నుంచి సైతం వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్థికశాఖ అధికారులూ చెబుతున్నారు.

Related Posts