విజయవాడ, మార్చి 9,
ఇప్పటి వరకూ వేధించారు. రైతులను అవమానించారు. అమరావతిని శ్మశానం అన్నారు. ఏపీ రాజధానిని సర్వనాశనం చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను రెండున్నరేళ్లు నానాతిప్పలు పెట్టారు. కేసులు, లాఠీదెబ్బలు, ఇనుప కంచెలతో ఏడిపించారు. హైకోర్టు తీర్పుతో పాలకుల పాపం పండింది. తాడేపల్లి ప్యాలెస్‌లో న్యాయం దక్కకున్నా.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయం నిలిచింది..గెలిచింది. హైకోర్టు ఆదేశాలతో అమరావతి కోసం వడివడిగా కార్యచరణ ప్రారంభించారు సీఆర్‌డీఏ అధికారులు. ఓవైపు మంత్రి బొత్స అర్థపర్థం లేని వాదనలు తెరమీదకు తీసుకొస్తున్నా.. హైదరాబాదే రాజధాని.. అమరావతి కేవలం శాసన రాజధాని.. అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నా.. అవన్నీ ఫ్రస్టేషన్‌లో వస్తున్న మాటలే కానీ.. హైకోర్టు తీర్పు ముందు అవేవీ నిలిచేవి కాదు. ఆ విషయం అందరికంటే ప్రభుత్వానికే బాగా తెలుసు. అందుకే, ఇక తప్పదంటూ.. తప్పేలా లేదంటూ.. అమరావతి నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. రెండున్నరేళ్లుగా ఆగిపోయిన కార్యచరణను మళ్లీ పునఃప్రారంభించారు సీఆర్‌డీఏ అధికారులు.రాజధాని నిర్మా ణంపై హైకోర్టు తీర్పుతో సీఆర్డీఏ అధికారుల్లో కాస్త కదలిక వచ్చింది. నెల రోజుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్లాట్లను అభివృద్ధి చేసి.. రైతులకు 3 నెలల్లో అప్పగించాలని న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు అమలులో భాగంగా.. ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. సీఆర్డీఏ కమిషనర్ విజయ కృష్ణన్ మార్చి 14 వరకూ అందుబాటులో లేకున్నా.. అప్పటి వరకూ పనులు పెండింగ్‌లో పెట్టకుండా.. పురపాలక శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి కార్యచరణ మొదలుపెట్టేశారు. కమిషనర్ లేకుండానే పనులు చేస్తున్నారంటే.. హైకోర్టు ఇచ్చిన టైంబౌండ్ ఆదేశాలు ఎంత కచ్చితమైనవో.. తేడా వస్తే ఎంత సీరియస్ అవుతుందో.. సర్కారుకు, సీఆర్‌డీఏకు బాగా తెలుసు. అందుకే, ఇంతటి హడావుడి అంటున్నారు. పురపాలక శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి స్వయంగా సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం 28,587 మంది రైతుల నుంచి 34,385 ఎకరాలను సమీకరించింది. ప్రతిగా వారికి నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలనేది ఒప్పందం. ఆ మేరకు భూ యజమానులకు మొత్తం 64,735 ప్లాట్లను కేటాయించింది. ఇందులో 38,282 నివాస... 26,453 వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 40,378 ప్లాట్లను రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియ నిలిచిపోయింది. హైకోర్టు తీర్పుతో ఎట్టకేలకు మళ్లీ కదలిక వచ్చింది. ఇంకా 24,357 ప్లాట్లను ఆయా రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను సీఆర్డీఏ అధికారులు తిరిగి ప్రారంభించారు. అధికారులు సంబంధిత రైతులకు ఫోన్లు చేసి.. మీకు కేటాయించిన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుతున్నారు. ఆహా.. ఎంతలో ఎంత మార్పు.. హైకోర్టు ఆదేశిస్తే కానీ రిజిస్ట్రేషన్లు చేయని సర్కారుకు ఆ తీర్పు చెంపపెట్టు.. అంటున్నారు.