కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి చాలా మంది వారసులు రంగంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో సీనియర్ నేతల తనయులు, తనయలు పోటీ చేశారు. వారిలో కొందరికి ఇప్పుడు సానుకూల స్పందన దక్కింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర గెలిచారు.ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభలో ఆ పార్టీ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తనయుడు ప్రియాంక ఖర్గే కూడా గెలిచారు. కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే, దళితుడికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే మల్లిఖార్జున ఖర్గే సీఎం అయ్యే అవకాశాలున్నాయి. ఆయన తనయుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ప్రధాని దేవేగౌడ తనయులిద్దరూ విజయం సాధించారు అటు కుమారస్వామి, ఇటు రేవణ్ణ.. ఇద్దరూ ఇబ్బంది లేకుండా మెజారిటీ సాధించారు. మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి సోదరులిద్దరూ విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. బళ్లారి సిటీ, హరప్పనహళ్లిలలో గాలి సోమశేఖర రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలు విజయం సాధించారు. బెంగళూరులోని జయనగర అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి హోమంత్రి రామలింగారెడ్డి తనయ సౌమ్యారెడ్డి పోటీ చేశారు. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఎన్నిక రద్దు అయ్యింది.