హైదరాబాద్
తెలంగాణ యువకతకు నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం కృషి వల్ల, ఇకనుంచీ ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అర్ధ శతాబ్దం పాటు తెలంగాణ కు జరిగిన అన్యాయ పరంపరను టిఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి గర్విస్తున్నానని అన్నారు. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95 శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్‌లలో 5% ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా కేడర్ పోస్టులకు తమ జోన్ లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని అయన అన్నారు.