లక్నో మార్చ్ 9
ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇక ఆ లింక్‌ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్‌కి, పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు షేర్ చేయాలని కూడా ఆ లేఖలో డిమాండ్ చేసింది. ఇలా చేస్తే కౌంటింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీలు లైవ్‌గా చూసినట్లు ఉంటుందని, కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కూడా జరిగినట్లు ఉంటుందని సమాజ్‌వాదీ పార్టీ ఆ లేఖలో అభిప్రాయపడింది.సమాజ్‌వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను ఎత్తుకెళ్తున్నారని ఆరోపించారు. ఎలాంటి నిబంధనలను పాటించకుండానే.. అభ్యర్థుల అనుమతి లేకుండా ఈవీఎంలను వేరేచోట్లకు తరలించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఈవీఎంలను పట్టుకోగానే, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ‘బీజేపీ ఓడిపోయే స్థానాల్లో కౌంటింగ్ నెమ్మదిగా జరిగేలా చూడాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ (పీఎస్) నుంచి ఆదేశాలు వెళ్లినట్టు మాకు సమాచారం ఉన్నది’ అని అఖిలేశ్ పేర్కొన్నారు.